/rtv/media/media_files/2025/11/08/arunodaya-cultural-federation-2025-11-08-21-29-58.jpg)
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో విశేష ప్రభావం చూపిన, వలస జీవుల కన్నీటి గాథను ఆవిష్కరించిన చారిత్రక గీతం 'అమ్మ పయిలం తల్లి మాయమ్మ' ను సోషల్ మీడియాలో కొందరు యువకులు రీల్స్ రూపంలో అత్యంత వ్యంగ్యంగా, అసభ్యంగా చిత్రీకరించడంపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తీవ్రంగా మండిపడింది. ఈ చర్యను అరుణోదయ తీవ్రంగా ఖండించింది.
తెలంగాణ వలస జీవనాన్ని 'బొంబాయి-దుబాయి-బొగ్గు బాయి' అంటూ నిర్వచించి, ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఈ పాటను కవి కోదారి శ్రీను రచించారు. దీన్ని గానం చేసి, ఆ పాటకు గుర్తింపుగా 'పయిలం సంతోష్' గా పేరు పొందిన గొప్ప కళాకారుడు ఈ పాట ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. రాష్ట్ర సాధనోద్యమ సమయంలో, అరుణోదయ ఈ పాటను తెలంగాణ ధూం-ధాం వేదికలపై వందలాది ప్రదర్శనల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది. అలాంటి చారిత్రక, ప్రజాదరణ పొందిన పాటను కొంతమంది యువకులు సోషల్ మీడియాలో 'రీల్' చేస్తూ అపహాస్యం చేయడంపై అరుణోదయ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
"ఇది సోషల్ మీడియా యొక్క వికృత చేష్టలకు పరాకాష్ట. ఎంతో మంది అమరవీరుల పాటలను, ప్రజల పోరాట చరిత్రను వక్రీకరించడం సరికాదు," అని అరుణోదయ నేతలు హెచ్చరించారు. ఉదాహరణకు, 'సుడిసిడి గుండాల' అనే అమరుల పాటను కూడా కొందరు 'రబ్బరు గాజులు, రైకలకు' అని ఆపాదించి రాయడం, అమరవీరుల పాటలను అపహస్యం చేయడం జరుగుతోందని వారు ఆరోపించారు.
ఈ పాటను పాడిన పయిలం సంతోష్ ప్రస్తుతం మన మధ్య లేరు, ఆయన అమరులయ్యారు. ఈ పాట యొక్క వక్రీకరణ కేవలం ఉద్యమానికి, పాటకు మాత్రమే కాకుండా, అమరుడైన సంతోష్‌ను కూడా ఎగతాళి చేసినట్టు, ఆయనకు అన్యాయం చేసినట్టు అవుతుందని అరుణోదయ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
అరుణోదయ డిమాండ్‌లు:
ఈ రీల్ చేసిన యువకులు వెంటనే ఆ వీడియోను తొలగించాలి.
ప్రజలకు, ఉద్యమకారులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
ఇట్లాంటి ప్రజల పాటలను, పోరాట చరిత్రను వక్రీకరించొద్దని అరుణోదయ తీవ్రంగా హెచ్చరించింది.
నెటిజన్లు, ప్రజలు, సాహిత్యాభిమానులు, ప్రజాభిమానులు అందరూ ఈ చర్యను ముక్తకంఠంతో ఖండించాలని, ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పి తమ నిరసనను ప్రకటించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విజ్ఞప్తి చేసింది.
Follow Us