/rtv/media/media_files/2026/01/15/fotojet-2026-01-15t072711-2026-01-15-07-27-28.jpg)
Article on female IAS..FIR on several channels
Hyderabad: మహిళా ఐఏఎస్ అధికారిపై కథనాల ప్రసారం కేసులో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) యాక్షన్ మొదలుపెట్టింది. ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, ఆ చానల్​ సెక్రటేరియెట్ రిపోర్టర్ సుధీర్‌ను బుధవారం అరెస్ట్ చేసింది. ఇదే చానల్‌కు చెందిన పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు అందజేసింది. దొంతు రమేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిట్ అదుపులోకి తీసుకొని బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు తరలించింది. అంతకుముందు ఇమిగ్రేషన్ అధికారులకు ట్రావెల్ స్టాపింగ్ మెమో జారీ చేయగా, దొంతు రమేశ్​ఎయిర్‌పోర్ట్ చేరుకున్న వెంటనే సిట్‌కు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత సుధీర్, పరిపూర్ణాచారి ఇండ్లలో సోదాలు చేసిన పోలీసులు.. వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకుని సీసీఎస్‌కు తరలించారు.
దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సుధీర్‌ను సిట్ ఇన్‌చార్జ్ శ్వేత ఆధ్వర్యంలో బుధవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎన్టీవీలో ప్రసారమవుతున్న ‘ఆఫ్ ది రికార్డ్’ ప్రోగ్రామ్‌లో నల్గొండకు చెందిన మంత్రి, మహిళా ఐఏఎస్‌పై టెలీకాస్ట్ చేసిన అసభ్య కథనానికి సంబంధించి విచారించారు. ఆ మంత్రి, మహిళా ఐఏఎస్ ఎవరు? ఆ సమాచారం మీకు ఎవరు ఇచ్చారు? ఏ ఆధారాలతో కథనం ప్రసారం చేశారు? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ముగ్గురు అందించిన వివరాలతో స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసినట్టు సమాచారం. కాగా, దొంతు రమేశ్​, సుధీర్‌కు కింగ్ కోఠి హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్లీ సీసీఎస్‌కు తీసుకొచ్చారు. అక్కడ సజ్జనార్ సమక్షంలో మరోసారి విచారించారు. ఆ తర్వాత మణికొండలో జడ్జి ముందు హాజరుపరిచారు.
కాగా, ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా ఐఏఎస్​ఆఫీసర్​వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలను ప్రసారం చేసిన ఎన్టీవీ, టీన్యూస్, ఇతర యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ సెక్రటరీ జయేశ్​రంజన్ సిటీ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోల మార్ఫింగ్‌కు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుకు ఆదేశిస్తూ.. డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారమే సిట్ ఏర్పాటు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో సిట్ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.
పలు ఛానల్స్ పై ఎఫ్‌ఐఆర్
కాగా, ఎన్టీవీలో ప్రసారమైన కథనానికి ఫొటోలు, వీడియోలతో కలిపి పలు యూట్యూబ్ చానళ్లు సహా ఓ పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాలోనూ ప్రసారం చేశారు. దీనికి మరింత మసాలా జోడించి వైరల్​చేశారు. దీంతో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పైనా సిట్ దృష్టి సారించింది. పలు ఛానల్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.ఈ క్రమంలోనే ఆయా యూట్యూబర్లు వీడియోలను డిలీట్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. పరారీలో ఉన్న యూట్యూబ్ చానళ్ల ప్రతినిధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్‌టీవీ యాజమాన్యం, ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్లు, తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ తెలుగు, వోల్గా టైమ్స్, మిర్రర్‌టైమ్ అఫీషియల్, టీన్యూస్ తెలుగు తదితర ఛానెళ్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
ఎవరిని వదలం..సజ్జనార్
కాగా, ఈ విషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ‘విచారణలో భాగంగా పిలిచినప్పుడు రావాలి కదా..? ఒక జర్నలిస్టు రాత్రి పారిపోయేందుకు ప్రయత్నించారు. సాయంత్రం 5.30 గంటలకు బ్యాంకాక్‌కు టికెట్ బుక్ చేసుకుని వెళ్తుండగా పట్టుకున్నాం. ఛానెల్ సీఈవో ఎక్కడున్నారు? తప్పు చేయకపోతే ఎందుకు భయం..? విచారణలో భాగంగా అందర్నీ పిలుస్తాం. ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెడతాం. అరెస్టుల తర్వాత పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం మీద కొందరు విమర్శలు చేస్తున్నారు. నిరంకుశ ప్రభుత్వం, ఎమర్జెన్సీ వచ్చిందని అంటున్నారు. ఎమర్జెన్సీ వస్తే ఇలా మాట్లాడేవాళ్లమా..? అందరూ లోపల ఉండేవారు. దర్యాప్తులో భాగంగా సోదాలకు వెళ్తాం. ముఖ్యమంత్రి మీద అసభ్య పోస్టులు పెట్టిన కేసులోనూ సిట్ దర్యాప్తు జరుపుతోంది’’ అని సజ్జనార్ స్పష్టం చేశారు.
Follow Us