Telangana Elections: తెలంగాణలో మరో ఎలక్షన్.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?

పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఘననీయ స్థానాలను దక్కించుకున్నామన్న ఉత్సాహంతో ఉన్న అధికార పార్టీ అదే ఊపులో పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి అయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

New Update
ghmc

ghmc Photograph: ( )

Telangana Elections: పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఘననీయ స్థానాలను దక్కించుకున్నామన్న ఉత్సాహంతో ఉన్న అధికార పార్టీ అదే ఊపులో పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. స్కూళ్లకు పరీక్షల సీజన్‌ మొదలయ్యేలోపే అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి అయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి మూడోవారం నాటికి అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో కమిషన్‌ అధికారులు సంబంధిత ఏర్పాట్లు మొదలుపెట్టారు. 

ఫిబ్రవరిలో ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఏడాది క్రితమే అంటే జనవరిలోనే గడువు ముగిసింది. అక్కడ ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. ఇక జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ల గడువు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అదే సమయంలో హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు కొత్తగా కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఏర్పడిన వాటితో కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జీహెచ్‌ఎంసీతో కలిపి మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఓటర్ల జాబితాకు సన్నాహాలు

అయితే మార్చిలో విద్యార్థులకు పరీక్షల సమయం, ఫిబ్రవరినుంచే వారి పరీక్షల సీజన్‌ మొదలయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ లోగానే ఎన్నికలు ముగించాలనే ఆలోచనలో ప్రభుత్వ ఉంది.  అదే సమయంలో ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని రెండు మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్‌ వరకు గడువు ఉంది. ప్రస్తుతం వాటిని మినహాయించి మిగిలిన వాటికి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మున్సిపాల్టీల్లో ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో పడింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి రెండోవారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తోంది. 

అభివృద్ధి పనులకు రూ.2,780 కోట్లు

కాగా, ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. దీనికోసం రూ.2,780 కోట్లు విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణస్థానిక సంస్థలకు వీటిని విడుదల చేశారు. ఈ నిధుల ద్వారా 2,432 పనులు చేపట్టనున్నారు. ఇవేకాకుండా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు, శివార్లలోని గ్రామ పంచాయతీలను విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు రూ.30 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేయడం గమనార్హం. కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన రాష్ట్ర వాటా నిధులు రప్పించేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి పెద్దఎత్తున నిధులు మంజూరు కావడంతో రాష్ట్రంలోని పట్టణస్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. జనవరి చివరి నాటికి ఈ పనులన్నీ కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం ఎన్నికలకు వెళ్తే అనుకున్న ఫలితాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు