Kesslapur Nagoba Jatara : నేటి నుంచి మరో అతిపెద్ద గిరిజన జాతర..ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మరో జాతర నేటి నుంచి జరగనుంది. అదికూడా తెలంగాణలోనే కావడం విశేషం. అదే నాగోబా జాతర.  రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.

New Update
FotoJet - 2026-01-18T082542.755

Kesslapur Nagoba Jatara

Kesslapur Nagoba Jatara :  ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది.ఈ నెల 28 నుంచి జాతర షూరు కానుంది. కాగా ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మరో జాతర నేటి నుంచి జరగనుంది. అదికూడా తెలంగాణలోనే కావడం విశేషం. అదే నాగోబా జాతర.  రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. మేడారం జాతర గిరిజన జాతరగా పేరుగాంచినప్పటికీ అన్ని వర్గాల ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారు. సుమారు కోటిన్నర మంది భక్తులు మేడారానికి వస్తారని అంచనా. అయితే పూర్తిగా గిరిజనులు మాత్రమే పాల్గొనే జాతర నాగోబా జాతర.  ఈ జాతరలో సర్పజాతిని పూజించడమే ప్రత్యేకత. అమావాస్య రోజు ఆరాధ్య దైవం నాగోబా(శేషనారాయణమూర్తి) పురి విప్పి నాట్యమాడతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా రాత్రి 7 గంటల నుంచి 12 గంటల మధ్యలో గిరిజన పూజారులకు ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల విశ్వాసం. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. గోండుల దేవత.

FotoJet - 2026-01-18T082710.437

 పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం రాత్రి 10 గంటలకు నిర్వహించే మహాపూజలతో ఈ జాతర ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, ఏడు రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర అంకురార్పణ జరుగుతుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. జాతరలో భాగంగా ఈనెల 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదేరోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్‌ పూజలతో పాటు మహిళలు విశేషంగా పాల్గొనే భాన్‌ దేవత పూజలు జరుగుతాయి. 22న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌ నిర్వహించి గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం 23న భేతల్‌ పూజలు, మండ గాజిలింగ్‌ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగిసినప్పటికీ, భక్తుల రద్దీ మాత్రం ఈనెల 25 వరకు కొనసాగుతుంది.

nagoba-jatara-1

 ఎక్కడ ఉంది? కధ ఏంటంటే?

నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామం లో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను గత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ గ్రామ జనాభా 400కు మించదు. కానీ పండగ రోజు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 18 నుంచి 24 వరకు నిర్ణీత రోజుల పాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. ఏటా పుష్యమాస అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్ప రూపంలోని నాగేంద్రుడికి తల్లి రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా ఒకచోట పాము ఉడుము రూపంలో కనిపించగా ఆ ఊరు పేరు ఉడుంపూరు అయిందని చెపుతారు. ఆ తర్వాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ.

FotoJet - 2026-01-18T082851.545

ఆ తర్వాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతని కోసం వెతికిన గౌరి.. గోదావరిలోనే సత్యవతి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని(పేథికొరియాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. ఏటా పుష్య మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం.

కాలినడకన పవిత్రజలం తెచ్చి....

నాగోబా దేవతకు మేస్రం వంశీయులు పూజలు నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు. వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మేస్రం వంశస్థుల్లోని కటోడా దివాకర్‌కి, ఘాడియా సంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు.కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో హస్త మడుగు వరకు అరణ్యం గుండా నడచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు. హస్త మడుగులో గిరిజనుల పూర్వీకులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చిందనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు. పుష్య పౌర్ణమి నాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలం లోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టు చెబుతారు.\

FotoJet - 2026-01-18T082813.311

22 పొయ్యిల మీద వంటలు

ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 100 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తర్వాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు(దుగుడు) ఉన్నాయి.ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారుచేయడం ఆచారంగా వస్తోంది. పుష్య మాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి ఇళ్లకు వెళ్లి కుండలు తయారుచేయాలని కోరతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర(చిప్పలు), దీపాంతలు, నీటి కుండలు కలిపి తయారీకి ఆర్డర్ ఇస్తారు.

Huge Devotees Rush at Nagoba Jatara_ (1)

నూతన వధువుల పరిచయం

మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని(Ganga Water) తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. కేస్లాపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి, అక్కడ వెలసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇక్కడి నుంచి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద నాలుగు రాత్రులు, ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి, పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రి చెట్టు దగ్గర బావి నీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారుచేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్థ రాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు. గోదావరి నది నుంచి తెచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్య క్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవ ధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవ ధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్ట మీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్రమాలను ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగ దేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్‌లో నాగోబా దేవుడి వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవుడికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనక వెదురు బుట్టలో పూజా సామాగ్రిని ఉంచుకొని కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు.

Huge Devotees Rush at Nagoba Jatara_ (26)

పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు. పూజలకు ముందు నాగోబా దేవుడి దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు. గతంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించాడు. ఈ సంఘటనతో ఉలిక్కి పడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ను ఆదిలాబాద్ జిల్లాకు పంపగా కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ను ప్రొఫెసర్‌ 1942లో మొదట నిర్వహించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు.

Huge Devotees Rush at Nagoba Jatara_ (10)

ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జనవరి 18 నుంచి 8 రోజుల వరకు నిర్వహించనున్నారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్‌రావ్‌ పటేల్‌, పెద్దలు చిన్ను పటేల్‌ ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు, కార్యక్రమాలు, మెస్రం వంశీయులు నిర్వహించే మహా పూజలతోపాటు రోజువారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర ఆదివారం ప్రారంభం కానుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువైన నాగోబా ఆలయంలో అందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25 వరకు జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించనుంది. 22న గిరిజన దర్బార్‌ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ రానున్నట్లు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ తెలిపారు. 

Huge Devotees Rush at Nagoba Jatara_ (19)

 సంప్రదాయాలకు పెద్దపీట..

నాగోబా జాతరలో మెస్రం వంశీయులు తమ ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. జాతరకు నెల ముందు పుష్య మాసం మొదలయ్యాక నెలవంకను చూడటంతో ఈ మహా ఘట్టానికి శ్రీకారం చుడుతారు. ఆ మరుసటి రోజు నుంచి మెస్రం వంశీయులు నివసించే ఏడు గ్రామాలను చుట్టిరావడం మొదలుపెడతారు. ఆ ప్రక్రియలో భాగంగా జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తినమడుగు నుంచి గోదావరి పవిత్ర జలాలను సేకరించేందుకు అదే ఏడు గ్రామాల మీదుగా మెస్రం వంశీయులు పాదయాత్రగా బయల్దేరుతారు. పూర్తిగా తెల్ల దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో ఈ ప్రక్రియ చేపడతారు. గోదావరి జలాలతో తిరిగి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయం మీదుగా కేస్లాపూర్‌ పొలిమేరలోని మర్రిచెట్టు వద్దకు చేరుకొని బస చేస్తారు. ఈ నెల 14న పాదయాత్ర పూర్తి చేసి మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్న మెస్రం వంశీయులు శనివారం ఉదయం తూమ్‌ (కర్మకాండ) పూజలు పూర్తి చేశారు. ఆదివారం పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని నాగోబాకు మహాపూజలు నిర్వహించడం ద్వారా జాతరను ప్రారంభించనున్నారు.

Huge Devotees Rush at Nagoba Jatara_ (5)

Advertisment
తాజా కథనాలు