Maoist: వరుస మావోయిస్టుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ఛత్తీష్ గఢ్ నెలలో అడుగుపెట్టనున్నారు. నెత్తురు ఏరులైపారుతున్న యుద్ధ భూమిలో మూడు రోజులపాటు బస చేయనున్నారు. మావోయిజాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి చేపట్టిన 'ఆపరేషన్ కగార్' కార్యక్రమాలను పరీశీలించనున్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకూ స్వయంగా భద్రతా బలగాల క్యాంపుల్లోనే స్టే చేయనుండగా.. మరోసారి దేశ వ్యాప్తంగా అలజడి మొదలైంది. అమిత్ షా పర్యటన సందర్భంగా బస్తర్ రేంజ్లోని నాలుగు జిల్లాల నుంచి దాదాపు వేయి మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు కూడా యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే అమిషా పర్యటనకు ముందు భారీ ఎన్ కౌంటర్లు జరగగా 103 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2024 ఎన్ కౌంటర్లు..
2024 అక్టోబర్ 4న ఛత్తీస్ గఢ్ లోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో 38మంది మావోయిస్టులు చనిపోయారు. ఒకేసారి ఇంతమంది మరణించడం చరిత్రలో తొలిసారి. అలాగే మాహాష్ట్రలోని గడ్చిరోలిలో 2024 జూలై 17న జరిగిన ఎన్ కౌంటర్లో 12మంది మావోయిస్టులు చనిపోయారు. 2024 మే 10న ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్ జిల్లా పిడియా సమీపంలోని జరిగిన ఎన్ కౌంటర్లో 12మంది నక్సలైట్లు హతమయ్యారు. 2024 ఏప్రిల్ 16 ఛత్తీస్ గఢ్ బస్తర్ రేంజ్ కంకేర్ లో 29మంది మావోయిస్టులను భద్రతా బలగాలు కాల్చిచంపాయి.
మావోయిస్టుల సంచలన లేఖ..
ఈ నేపథ్యంలో విప్లవాన్ని అణచివేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ‘కగార్’ను చేపట్టాయని మావోయిస్టు పార్టీ మండిపడుతోంది. బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు(బీకే-ఏఎస్‌ఆర్) డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో గురువారం ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో భాగంగానే గ్రామాలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు చేస్తూ బూటకపు ఎన్‌కౌంటర్లను నిజమైన ఎన్‌కౌంటర్లుగా చిత్రీకరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు.
మూడున్నర నెలల కాలంలో భద్రతా బలగాలు 103 మందిని పొట్టనబెట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 మంది ఆదివాసీ మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నట్టు తెలిపారు. 2024 చివరి నాటికి మావోయిస్టు పార్టీని మట్టుబెడతామని హోం మంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితమే ప్రతినబూనారని, బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా దేశాన్ని శాసిస్తూ.. కోర్టులు, జైళ్లు, సెబీ వంటి సంస్థలు, ఉపా వంటి చట్టాలను తీసుకొచ్చి హక్కుల కోసం ఉద్యమించే ప్రజలను, విప్లవోద్యమ పోరాటాలను అణచివేస్తున్నదని ఆరోపించారు.