Shock To BRS : భద్రాచలం(Bhadrachalam) బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkat Rao) కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరిపోయారు. నిన్న తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీలో చేరడం కన్ఫామ్ అయ్యింది. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. వెంకట్రావును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు భద్రాచలం బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది స్థానాలకు గాను.. 9 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే.. భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలుపొందారు.
ఇది కూడా చదవండి: Telangana : బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కందాల ఉపేందర్ రెడ్డి !
అయితే.. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే తెల్లం కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం ప్రారంభమైంది. గతంలో వెంకట్రావు నేటి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ కు దగ్గర అయ్యారన్న ప్రచారం సాగుతోంది. ఇటీవల నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి సైతం ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తెల్లం వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ వశమైంది.
దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను ఒక్క సీటు కూడా గెలవనివ్వమంటూ ప్రకటించిన మంత్రి పొంగులేటి మాట నిలబెట్టుకున్నారన్న చర్చ సాగుతోంది. అయితే తెల్లం చేరికను మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొదెం వీరయ్య వ్యతిరేకించారు. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయనకు అవకాశం కల్పించడంతో ఆయన శాంతించినట్లు తెలుస్తోంది.