Telangana Government: తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నిటినీ ఎత్తివేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఉద్యమకారులు, వారిపై నమోదైన కేసుల వివరాలు అందించాలని డీజీపీతో పాటు జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. 2009 డిసెంబరు 12 నుంచి 2014 జూన్ 2 వరకూ ఉద్యమకారులపై నమోదైన అన్ని కేసుల వివరాలనూ అందించాలని ఎస్పీలను ప్రభుత్వాధికారులు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: రేపటి నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. అవి ఉండాల్సిందే!
గతంలో హోంమంత్రిగా నాయిని నరసింహారెడ్డి ఉన్న సమయంలోనూ ఉద్యమకారులపై కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. రైల్వే కేసుల వంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేసులతో పాటు మరికొన్ని మిగతా కేసులు పెండింగులో ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని మార్గదర్శకాలు రూపొందించి గతంలో ఉద్యమకారులపై పలు కేసులు ఎత్తివేశారు.
తాజాగా మిగిలి ఉన్న అన్ని కేసుల ఎత్తివేతపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యమకారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికేసులు పెండింగులో ఉన్నాయి.. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతమందికి ఉపశమనం కలుగుతుందీ.. తదితర అంశాలపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.