Minister Seethakka: సీతక్క.. ఈ పేరును తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆ పేరులోనే ఎంతో ఆప్యాయత ఉంటుంది. ఆమె పిలుపులోనూ.. పలకరింపులోనూ అంతే అప్యాయత కనబడుతుంది. ఎన్నేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సీతక్క.. ఇప్పుడు మంత్రి పదవి చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెను ప్రజలంతా ప్రేమగా సీతక్క అని పిలిచేవారు. ఇప్పుడు మంత్రి అవడంతో కొందరు మేడమ్ అని పిలుస్తున్నారు. దాంతో సీతక్కలో చిన్న అసంతృప్తి మొదలైంది. మేడమ్ అనే పిలుపులో అప్యాయత లేదని, తనను సీతక్క అనే పిలవాలని అధికారులకు, ప్రజలకు సూచించారు సీతక్క.
గురువారం ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం జామినిలో 'ప్రజా పాలన' కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అధికారులతో ఆప్యాయతగా వ్యవహరించారు. గ్రామసభలో పాల్గొన్న మంత్రి సీతక్కను అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు మేడమ్ అని పిలిచారు. దాంతో వెంటనే స్పందించిన మంత్రి.. తనను మేడమ్ అని కాకుండా సీతక్కా అని పిలవాలని కోరారు. తాను ఇప్పటికీ ఎప్పటికీ మీ సీతక్కనే అని.. మేడమ్ అంటే దూరం అయిపోతానని వ్యాఖ్యానించారు మంత్రి సీతక్క.
‘మీకో చిన్న విన్నపం.. నన్ను మేడం అని పిలవొద్దు.. సీతక్క అని పిలవండి చాలు. మేడమ్ అంటే బంధం దూరం అవుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. సీతక్క అంటే మీ అక్క, మీ చెల్లిలా కలిసి పోతా. మేడమ్ అంటే దూరం అవుతున్నట్లుగా ఉంది. పదవులు శాశ్వతం కాదు.. విలువలు, మంచి పనులే ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటే గడీల పాలన కాదు. గల్లీ బిడ్డల పాలన. ఏ అవసరం ఉన్నా మాతో స్వేచ్చగా చెప్పొచ్చు.' అని మంత్రి సీతక్క అన్నారు.
Also Read: