Job Calendar: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌క్యాలెండర్ 2024-25పై అభ్యర్థుల నుంచి అనేక సందేహాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ షెడ్యూలు సరిగా లేదంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పరీక్షల టైమ్ టేబుల్, ఒకే రకమైన విద్యార్హతలు, ఒకటే కేటగిరీ పోస్టులకు వేర్వేరు నియామక సంస్థలకు సబంధించిన వివరాలు సరిగ్గా లేవంటున్నారు. అంతేకాదు పరీక్షల మధ్య వ్యవధి కూడా ఉండకపోవడంతో పాటు ఒకేరకమైన పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారనే అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక దరఖాస్తుకు, పరీక్షకు ఇచ్చే గడువు తక్కువగా కేటాయించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఏదైనా ఓ పరీక్షకు దూరం కావాల్సిందేనా..
ఈ మేరకు 2022లో జారీ చేసిన గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనకు రాతపరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. అయితే డిసెంబరులోనే గ్రూప్-2 రాతపరీక్షల షెడ్యూలు ఉండటంతో నెల వ్యవధిలోనే రెండు పరీక్షలకు హాజరుకావడంపై అభ్యర్థులు భారంగా భావిస్తున్నారు. ఇక ఇంజినీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్ సంస్థలు, ప్రభుత్వ ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఏఈ, ఏఈఈ, సబ్‌ఇంజినీర్ తదితర పోస్టులకు 2024 అక్టోబరులోనే ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. వీటికి జనవరిలో రాతపరీక్షలు నిర్వహించేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేయనుంది. అయితే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులుండగా.. ఈ విభాగాల పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక ప్రభుత్వ డిగ్రీ, గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ ఇతర పోస్టులకు 2025 జూన్‌లో ఉద్యోగ ప్రకటనలు టీజీపీఎస్సీ, గురుకుల నియామక బోర్డులు వేర్వేరుగా జారీ చేయనున్నాయి. దీంతో ఒకే విద్యార్హత ఉన్న పరీక్షలు ఏక కాలంలో ఎలా నిర్వహిస్తారంటూ అభ్యర్థుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇక డీఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరిలో రానుండగా ఏప్రిల్‌లో పరీక్షలను ప్రకటించారు. ఏప్రిల్‌లోనే డిగ్రీ, పీజీ అర్హతలతో గెజిటెడ్ స్థాయి అధికారుల నోటిఫికేషన్‌లో పరీక్షల షెడ్యూలు ఖరారు చేశారు. ఇక గ్రూప్-3 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ 2025 జులైలో రానుండగా దీనికి అర్హత ఏదైనా డిగ్రీగా పేర్కొన్నారు. అదే సమయంలో సింగరేణిలో బీఈ, బీటెక్, ఇతర అర్హతలతో కూడిన ఉద్యోగ నోటిఫికేషన్ వెలువనుంది. ఇలా ఒకే రకమైన ఉద్యోగాలుకు నెల వ్యవధి లేకుండా పరీక్షలు నిర్వహిస్తే తాము నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Lucknow Case: దంపతులపై నీళ్లు చల్లిన గ్యాంగ్ అరెస్ట్.. సీఎం యోగి సీరియస్ యాక్షన్!
అలాగే వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అధికారులు, ఫార్మసిస్టులకు 2024 సెప్టెంబరులో ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటన విడుదల చేయనుంది. అయితే ఉద్యోగ ప్రకటన జారీ తర్వాత దరఖాస్తుల స్వీకరణకు కనీసం 15 నుంచి 30 రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత రాతపరీక్షకు కనీసం 45 రోజుల నుంచి మూడు నెలల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు 2024 నవంబరులో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. దీంతో కనీస గడువు లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమ ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.