Telangana Job Calendar: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయనున్న జాబ్ క్యాలెండర్ లో ఏ శాఖ నుంచి అధిక పోస్టులుండనున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే గ్రూప్-1,2,3,4 తోపాటు కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్, డీఎస్సీ, వైద్య, తదితర శాఖలకు సంబంధించి ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే నోటిఫికేషన్ లో ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు? ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాలీలున్నాయో ఒకసారి పరిశీలిస్తే విద్యాశాఖనుంచి అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
మోడల్ స్కూళ్లలో 707 టీచర్ పోస్టులు..
ఈ మేరకు త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ క్యాలెండర్‌లో పాఠశాల, కళాశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు మెజార్టీగా కనిపిస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 110, కాలేజీ పరిధిలో 600 ఖాళీలను భర్తీ చేయాల్సివుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూళ్లలో 707 టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే త్వరలో మరో 5 వేలకుపైగా పోస్టులతో డీఎస్సీ ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దీని ఆధారంగా చూస్తూ విద్యాశాఖలోనే అధిక పోస్టులుండబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Murders: ఆ కక్షతో 42 మంది మహిళలను చంపిన 33 ఏళ్ల యువకుడు!
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో..
రాష్ట్రవ్యాప్తంగా 2012లో 194 మోడల్ స్కూళ్లను ప్రారంభించారు. వాటిల్లో 3,880 పోస్టులను మంజూరు చేయగా ఇంకా 1,047 ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన టీచర్ల ఖాళీలు 707 ఉన్నాయి. మోడల్ స్కూళ్లకు 318 జీఓ వర్తించదని కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నియామకాలకు అడ్డంకిగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం అలాంటి కేసే గురుకులాల విషయంలో ఉన్నా అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేపట్టారని, ఇక్కడా అలాగే చేయవచ్చని అంటున్నారు.
డిగ్రీ కళాశాలల్లో 544 ఖాళీలు..
పాఠశాల విద్యాశాఖలో 134 ఖాళీల భర్తీకి 2022 నవంబరులో ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ జీఓ165ను జారీ చేసింది. అందులో 110 అధ్యాపక, సీనియర్ అధ్యాపక పోస్టులున్నాయి. వాటిలో రాష్ట్రంలో 12 డైట్ కళాశాలల్లో 65 అధ్యాపక, మరో 23 సీనియర్ అధ్యాపక ఉద్యోగాలున్నాయి. వరంగల్, మహబూబ్‌నగర్, నాగార్జునసాగర్‌లోని మూడు ప్రభుత్వ బీఈడీ కళాశాలలు, హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, ఎస్‌సీఈఆర్‌టీలో మరో 22 అధ్యాపక ఖాళీలు కలిపి మొత్తం 110 కొలువులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీకి అనుమతి ఇచ్చినా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారు. డిప్యూటీ ఈఓ ఖాళీలు 24 ఉన్నందున వాటిని కూడా జాబ్ క్యాలెండర్‌లో చేర్చనున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే వాటిని గ్రూపు-1లో చేర్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. డిగ్రీ కళాశాలల్లో 544 ఖాళీల భర్తీకి 2022లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 491 అధ్యాపక, 29 ఫిజికల్ డైరెక్టర్లు, 24 లైబ్రేరియన్ల ఉద్యోగాలున్నాయి. వాటికి 2022 డిసెంబరు 31న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగిపోయింది. ఆర్థికశాఖ ఆదేశాలతో ఖాళీల వివరాలను పంపినట్లు కళాశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.