తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అలోక్ అరాధే తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయ మూర్తులు హాజరయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన 6వ న్యాయమూర్తిగా అరాధే నిలిచారు.
జస్టీస్ అలోక్ అరాధే స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పూర్. అరాధే 1964 ఏప్రిల్ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. డిగ్రీ అనంతరం ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన.. 1988లో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. దాదాపు 19 సంవత్సరాలు న్యాయవాదిగా విధులు నిర్వర్తించిన ఆయన.. 2007లో సీనియర్ న్యాయవాదిగా మారారు. 2016లో మొదటిసారిగా జమ్మూకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా ఎంపికైన ఆయనా.. 2018వ సంవత్సరం నవంబర్ 17న కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
2019లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టుల విభజన జరుగగా.. తెలంగాణలో గత నాలుగేళ్లలో ఆరుగురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హై కోర్టు న్యాయ మూర్తులుగా జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విధులు నిర్వర్తించగా.. ఇందులో పలువురు న్యాయమూర్తిలు పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లారు.
హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ గవర్నర్‌ను ఆప్యాయంగా పలకరించారు. గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పరిస్థితి పచ్చగట్టి వేస్తే భగ్గుమనేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంతో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు గవర్నర్‌పై పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజ్ భవన్‌లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యంగ బద్ద పదవిలో ఉండి రాజకీయాలు చేయడం ఏంటన్న నేతలూ.. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందవద్దనే దురుద్దేశంతో ఉన్నారని మండిపడ్డారు.
మరోవైపు ఈ వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ తన వద్దకు ఎలాంటి బిల్లులు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వమే తనపై బురద జల్లుతోందన్నారు. గతంలో ఢిల్లీ వెళ్లిన గవర్నర్.. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో బహిరంగంగానే బీఆర్‌ఎస్ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో తాను ఎక్కడికి వెళ్లినా తనను అధికారులు పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ప్రొటోకాల్ వ్యవస్థలేదని, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. గతంలో ప్రారంభ సభలో గవర్నర్ ప్రసంగం ఉండేదని, కానీ కేసీఆర్ సర్కార్ కావాలనే గవర్నర్ ప్రసంగాని నిలిపి వేశారని మండిపడ్డారు.