తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు (TS Sarpanch Elections 2024) ఎప్పుడు జరుగుతాయి? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గడువులోగా ఎన్నికలు పడుతుందా? లేక మరికొన్ని రోజులు ఆగుతాయా? అన్న విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. వాస్తవానికి వచ్చేనెల 31తో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వం నుంచే ఇంకా స్పందన రాకపోవడంతో ఈసీ ఎదురు చూస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: RYTHU BANDHU: రైతుబంధుపై సీలింగ్.. రేవంత్ సర్కార్ నిర్ణయం అదేనా?
లోక్ సభ ఎన్నికల (Loksabha Elections 2024) తర్వాత పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీఅ అమలుపైనే ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎన్నికల నాటికి ఆరు గ్యారెంటీలను అమల్లోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇది తమకు అదనపు బలంగా మారుతుందని అంచనా వేస్తోంది. ఇంకా రాష్ట్రంలోని సర్పంచ్ లుకు రూ.1200 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ఒక్కో సర్పంచ్ కు యావరేజ్ గా రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో ఆ పార్టే అధికారంలోకి రావడంతో రిజర్వేషన్లు మారుస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. కేవలం బీసీల రిజర్వేషన్లు మార్చినా.. అనేక పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దీంతో ఈ చర్చ కూడా సాగుతోంది.