Telangana Ex-DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న ఆమె.. అందుకు సంబంధించి ఓ పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించారు. కాగా, సీఎంను కలిసిన నళిని ఆధ్యాత్మిక ప్రచారానికి ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలుస్తోంది. గతంలోనూ.. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించినా.. ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు నళిని.
తెలంగాణ(Telangana) సాధన కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఆమె ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. పోలీసు(Telangana Police) అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో నళిని గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. తెలంగాణ సాధన కోసం ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని అధికారులను సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.
Also Read: