తెలంగాణలో ఎన్నికల (Telangana Elections 2023) వేడి తారా స్థాయికి చేరింది. నామినేషన్ల స్క్రూటినీ, ఉప సంహరణ కూడా పూర్తవడంతో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉన్నారో తేలిపోయింది. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కండువా మార్చేసి వేరే పార్టీ నుంచి పోటీకి దిగారు. కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరూ పార్టీలు మారిన వారే కావడం అక్కడి ఆసక్తికరంగా మారింది. అలాంటి నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి
నకిరేకల్: 2018లో నకిరేకల్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల వీరేశం, కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య బరిలోకి దిగారు. అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా చిరుమర్తి, కాంగ్రెస్ అభ్యర్థిగా వేముల పోటీ చేస్తున్నారు.
పినపాక: 2018లో టీఆర్ఎస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ తరఫున రేగా కాంతారావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పాయం, బీఆర్ఎస్ నుంచి రేగా తలపడుతున్నారు.
కొల్లాపూర్: 2018లో టీఆర్ఎస్ నుంచి ఫైట్ చేసిన జూపల్లి కృష్ణారావు ఈ సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే.. నాడు కాంగ్రెస్ నుంచి ఆయనపై గెలిచిన బీరం హర్షవర్దన్ రెడ్డి ఈ సారి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Dubbaka: దుబ్బాకలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్.. ఎమ్మెల్యేగా గెలిచి నిలిచేదెవరు?!
ఇల్లందు: 2018లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన హరిప్రియ.. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా మారారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కోరం కనకయ్య ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు.
పాలేరు: ఇక్కడ 2018లో కాంగ్రెస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు హోరాహోరీగా తలపడ్డారు. అయితే.. ప్రస్తుత ఎన్నికల్లో కందాల బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ ను వీడిన తుమ్మల ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
సత్తుపల్లి: ఇక్కడి నుంచి 2014, 18లో టీడీపీ నుంచి గెలుపొందిన సండ్రా వెంకటవీరయ్య ఈ సారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో ఈయనపై వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మట్టా దయానంద్ సతీమణి రాగమయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: TS Elections: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే!
భూపాలపల్లి: ఇక్కడ కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తారుమారయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన గండ్రా వెంకటరమణారెడ్డి ఈ సారి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా.. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గండ్రా సత్యనారాయణ ఈ సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.
కొత్తగూడెం: కొత్తగూడెంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు ఈ సారి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన జలగం వెంకట్రావు ఈ సారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుపై పోటీలో ఉన్నారు.