Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది రోజులే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు, పథకాల లబ్ధిదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చింది. రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలకు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు విడుదల చేయడం కుదరదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో వున్న ఈ సమయంలో ఎలాంటి పథకాలు అమలు గానీ, డబ్బులు జమ చేసే కార్యక్రమాలు గానీ చేయకూడదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఆయా పథకాల లబ్ధిదారులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
ఈసీకి సర్కారు రిక్వెస్ట్..
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఇప్పటికే అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్ మాత్రం సరిగ్గా ఎన్నికల సమయంలో రైతులు, ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కేసీఆర్ సర్కార్ సంప్రదించింది. అయితే.. ఈ విజ్ఞప్తులను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పెండింగ్ డీఏలు ఇప్పుడు ఎలా ఇస్తారు..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. దీంతో కేసీఆర్ సర్కార్‌కు ఈసీ ఝలక్ ఇచ్చినట్లయ్యింది. నిన్న, మొన్నటి వరకూ రైతుబంధు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. రైతన్నలకు రైతుబంధు ఇస్తామంటే.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ పెద్దలు ఆరోపించారు. అంతేకాదు.. కాంగ్రెస్ అడుగడుగునా ఇలా అడ్డంకులు సృష్టిస్తోందని ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రైతు బంధు ఆపాలని సైతం ఎవరి నుంచి తమకు ఫిర్యాదులు ఇప్పటివరకూ అందలేదని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా పై విధంగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.