కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకలో రోడ్డు, గుడి, బడి వేసింది కాంగ్రెస్‌ అని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

New Update
కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మరో 9 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి మరికొన్ని రోజులే సమయం ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రచారంలో స్పీడ్ పెంచారు. సీఎం కేసీఆరే (CM KCR) టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు.

ఈరోజు నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయ భేరి యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 10 ఏండ్లు అధికారంలో ఉండి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని..గిరిజనులను ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నేతలను ప్రశ్నించారు రేవంత్. పాలమూరులో వలసలు, ఆత్మహత్యలు ఆగలేదని అన్నారు. ఎక్కడికి వెళ్లినా వలస వెళ్లిన పాలమూరు బిడ్డలే కనబడతారు అని పేర్కొన్నారు.

ALSO READ: కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. భట్టి సీఎం కాడు.. కేసీఆర్ జోస్యం!

తెలంగాణలో 91 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు రైతు భరోసా పథకం ప్రకటించామని అన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. తెలంగాణలో దొరల రాజ్యాన్ని బొందపెట్టి..ఇందిరమ్మ రాజ్యం తేవడమే తన లక్ష్యమని అన్నారు.

డిసెంబర్‌ 9న తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని అన్నారు. ఓట్లు కొనుగోలు చేసి అందలం ఎక్కాలని కలలు కంటున్నారని బీజేపీ, బీఆర్ఎస్ ఉద్దేశిస్తూ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే మేజర్‌ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్‌ హయాంలోనే 70 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకలో రోడ్డు, గుడి, బడి వేసింది కాంగ్రెస్‌ పార్టీయే అని అన్నారు. ప్రపంచానికి ఐటీ నిపుణులను ఎగుమతి చేసింది ఇందిరమ్మ రాజ్యంలోనే అని గుర్తు చేశారు.

ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత!

Advertisment
తాజా కథనాలు