Election Commission Rules: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక మొదటి అంకం ముగిసింది. నేటితో నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. ఈ నెల 15వ తేదీన ఎవరు ఎన్నికల బరిలో ఉంటారు.. ఎవరు నిష్క్రమిస్తారు అనేది తేలిపోతుంది. ఎవరు ఉన్నా.. ఎవరు వెనక్కి తగ్గినా.. ఈసారి ఎలక్షన్స్ మాత్రం మరింత సరవత్తరంగా సాగనుందనే విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పొలిటికల్ హీట్ మరింత పెంచుతున్నారు. బుల్లెట్ల లాంటి తమ మాటలతో.. ప్రత్యర్థులను ఎన్నికల రణక్షేత్రంలో దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల ప్రచారానికి కూడా ఒక లిమిట్ ఉంటుందని అభ్యర్థులు గుర్తించాల్సిన అవసరమైతే ఉంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకే పార్టీలైనా, అభ్యర్థులైనా ఎన్నికల ప్రచారాన్ని, ఇతర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. లేదంటే.. ఈసీ తీసుకునే చర్యలకు బలి కావాల్సి వస్తుంది. మరి ఎన్నికలో బరిలో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీల నేతలు, ప్రభుత్వం ఏ విధంగా నడుచుకోవాలి? నేతలు ఏ నిబంధనలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఎన్నికల నిబంధనలు ఇవే..
✬ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కుల, మత, భాష ప్రాతిపదికన రెచ్చగొట్టే, విద్వేషాలు పెంచే ప్రసంగాలు చేయకూడదు.
✬ యజమానుల అనుమతి లేకుండా వారి భూములు, భవనాలను ప్రచారానికి ఉపయోగించకూడదు.
✬ నిషేధాజ్ఞలు, ఆంక్షలున్న ప్రదేశాల్లో సమావేశాలు, సభలు నిర్వహించకూడదు.
✬ మందిరాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన ప్రదేశాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దు.
✬ బహిరంగ సమావేశాల్లో మైక్, లౌడ్ స్పీకర్ల వినియోగానికి పోలీసుల అనుమతి తీసుకోవాలి.
✬ ఎన్నికల ప్రచార సమావేశాలకు పోలీసుల నుంచి ముందుగా లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి.
✬ ఊరేగింపులు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించే ముందు పోలీసులకు రూటు వివరాలను తెలియజేయాలి.
✬ ప్రత్యర్థి పార్టీల విధానాలు, పథకాలపైన, ఇతర కార్యక్రమాలపై మాత్రమే విమర్శలు ఉండాలి. వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయొద్దు.
✬ ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, బెదిరించడం నిషేధం.
✬ ఒక వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేయడం చట్ట విరుద్ధం.
✬ ఇతర పార్టీల ఎన్నికల ప్రచారానికి, సమావేశాలకు ఆటంకం కలిగించొద్దు.
✬ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఊరేగింపులుండాలి. దిష్టిబొమ్మలు దహనం చేయొద్దు.
✬ ఉద్యోగుల బదిలీపై పూర్తి నిషేధం ఉంటుంది. మంత్రులు.. ఎన్నికల అధికారులను ఎక్కడికీ పిలవరాదు.
✬ మంత్రులు పైలట్ కార్లు, ఎర్ర బుగ్గ కార్లు ఉపయోగించరాదు.
✬ నిధులు మంజూరు చేయొద్దు. కొత్త పనులు చేపట్టకూడదు. కొత్త పనులకు ఆమోదం తెలపకూడదు.
Also Read:
లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..