CM KCR Election Campaign: తెలంగాణ ఎన్నికల ప్రకటన రావడమే ఆలస్యం.. బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తన ప్రచారాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టారు. వాస్తవానికి ఎన్నికల ప్రకటన కంటే ముందే.. బీఆర్ఎస్ అధినేతగా సమరశంఖం పూరించారు కేసీఆర్. ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుండగా.. తాను సైతం సుడిగాలి పర్యటనలతో ప్రచారం సాగించారు. రోజుకు మూడు, నాలుగు సభల చొప్పున నెల రోజుల వ్యవధిలోనే 96 సభల్లో పాల్గొని పొలిటికల్ హీట్ క్రియేట్ చేశారు.
ఎన్నికల సంఘం తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు నవంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అక్టోబర్ 9న ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనకు ముందే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ తరువాత అక్టోబర్ 15 నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించిన రోజు నుంచే హుస్నాబాద్ వేదికగా.. పబ్లిక్ మీటింగ్స్‌లో వరుసగా పాల్గొంటూ వచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి తేదీ అయిన నవంబర్ 28న అంటే ఇవాళ సైతం గజ్వేల్‌లో చివరి ఎన్నికల ప్రసంగం చేశారు.
మొత్తం 96 ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు కేసీఆర్ హాజరయ్యారు. అక్టోబర్ 15న హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభను నిర్వహించిన సీఎం కేసీఆర్.. 22 నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. వీటిలో రంగారెడ్డి జిల్లాలలోని 7 నియోజకవర్గాలు, హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో సభలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఒక్క జనగామ నియోజకవర్గంలోనే రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహించారు. ఇక సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభతో తన ప్రచారాన్ని ముగించారు కేసీఆర్. ఈ నెల 15 రోజుల వ్యవధిలో రోజుకు 3, 4 సభల్లో పాల్గొన్నారాయన. ఈ సభల్లో గడిచిన పదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, గత పాలకులు చేసిన పనులను వివరిస్తూ ప్రచారాన్ని సాగించారు. మరొక్కసారి అవకాశం ఇస్తే.. రెట్టింపు అభివృద్ధి చేస్తామన్నారు.
Also Read:
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..
ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!