Revanth Reddy-EC: రేవంత్ రెడ్డి భాష బాగలేదు.. ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్!

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఈసీకి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా తొలగించాలని కోరింది. రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో ఆ పార్టీ శ్రేణులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

New Update
Revanth Reddy-EC: రేవంత్ రెడ్డి భాష బాగలేదు.. ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్!

టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (Revanth Reddy) హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ ఈసీకి (Election Commission of India) ఫిర్యాదు చేసింది. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డిని తొలగించాలని కోరింది. బీఆర్ఎస్ లీగల్ సెల్ కు సోమ భరత్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి సీఈఓకు నాలుగు ఫిర్యాదులు అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని, ఈసీని ఆ పార్టీ బేఖాతరు చేస్తోందని ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దురదృష్టవశాత్తు ఈసీ ఇప్పటికీ కాంగ్రెస్ పై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన రెచ్చిపోతున్నారన్నారు. కేసీఆర్ శిరచ్ఛేదం చేయాలని రేవంత్ అంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే భాష ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలంటే హింసను రెచ్చగొట్టడమేనా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: అర్థరాత్రి ధర్నాకు దిగిన సీతక్క.. కారణమిదేనట..

తొమ్మిదిన్నరేళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అని అన్నారు. రేవంత్ మాటలతో కాంగ్రెస్ లో ఉన్నవాళ్లు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈసీని గతంలోనే కోరామన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఈసీకి ఈ అంశంపై ఫిర్యాదు చేశామన్నారు. అయినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. బీఆర్ఎస్ హింసను ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. సీఈఓకు అన్ని విషయాలు వివరంగా చెప్పామన్నారు. వెంటనే చర్యలు తీసుకోపోతే వ్యవస్థ అరాచక శక్తుల చేతుల్లోకి పోతుందని కూడా విన్నవించామన్నారు.
ఇది కూడా చదవండి: KTR: నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఈ ఫిర్యాదుపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ చట్టాన్ని ఉల్లంఘించి అసత్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఛానళ్ల ముసుగులో దొంగ మనషులు బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 28 ఛానళ్ల వివరాలు ఈసీకి ఇచ్చామన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.

కాంగ్రెస్ తెరవెనుక ఉండి సునీల్ కనుగోలు లాంటి వాళ్లు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు సోమ భరత్. సునీల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రేవంత్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రచారానికి దూరం పెట్టాలని కోరినట్లు చెప్పారు. క్యూన్యూస్ లో కాంగ్రెస్ కు నేరుగా ప్రచారం చేస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. స్టడీఐక్యూ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు