Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన ప్రచార పర్వం నేటితో ముగిసింది. అయితే, ఈ ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అంటూ మాటల తూటాలతో రెచ్చిపోయాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో తెలియదు కానీ.. ప్రధాన పార్టీలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంతో హోరెత్తించాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. కీలక నియోజకర్గాల్లో పర్యటించడం, బహిరంగ సభల్లో పాల్గొనడం ద్వారా అభ్యర్థులు, పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు సహా కీలక నేతలందరూ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ స్థాయి నేతల ప్రచారం ఎలా సాగిందో ఓసారి లుక్కే్ద్దాం..
బీజేపీ అగ్ర నేతల ప్రచారం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 27వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ, మాదిగ ఉప కులాల విశ్వరూప మహా సభల్లో పాల్గొన్న ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్, నిర్మల్, మహబూబ్ బాద్, కరీం నగర్ లో ప్రధాని సభలు ఏర్పాటు చేయగా.. ఆయా సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 12 సభల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, కూకట్ పల్లి, జగిత్యాల, బాన్సువాడ, జుక్కల్, బోధన్, హుజూర్ నగర్, చేవెళ్ల, నారాయణ పేట, మల్కాజ్ గిరి, జూబిలీ హిల్స్ సభల్లో పాల్గొన్న నడ్డా పాల్గొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యధికంగా 21 సభల్లో పాల్గొన్నారు. రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట, కోరుట్ల, కొల్లాపూర్, ఖైరతాబాద్, మక్తల్, ములుగు, భువనగిరి, మునుగోడు, పటాన్‌చెరు, ఆర్మూర్,హుజూరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జనగామ, ఉప్పల్, నల్గొండ, వరంగల్,గద్వాల్, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ వేదికగా బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యెగి ఆదిత్యనాధ్ మొత్తం 8 సభల్లో పాల్గొన్నారు. సిర్పూర్, వేములవాడ, గోషామహల్, మహబూబ్ నగర్, కల్వకుర్తి, సనత్ నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో యోగి ఆదిత్యనాధ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ హుజురాబాద్, మహేశ్వరం, కంటోన్మెంట్, ఆర్మూర్, మేడ్చల్, కార్వాన్ ఎన్నికల ప్రచార సభల్లో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పాతబస్తీలోని చార్మినార్, మలక్ పేట తో పాటు సిర్పూర్, పరకాల, దేవరకద్ర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ అగ్ర నేతల ప్రచారం..
తెలంగాణ టార్గెట్ గా రాష్ట్రాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు చుట్టేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా 90 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాదాపు అన్ని నియోజకవర్గాలు కవరయ్యేలా ప్రచారం నిర్వహించారు.
రాహుల్, ప్రియాంక, ఎఐసీసీ అధ్యక్షులు ఖర్గేతో పాటు జాతీయ నేతలు తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు విస్తృతంగా ఎన్నికల సభలు నిర్వహించారు. అధిక నియోజకవర్గాల్లో కర్ణాటక నేతల ప్రచారం చేశారు. 20కిపైగా సభల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రచారం చివరి రోజు హైదరాబాద్ లో భారీ రోడ్‌షో నిర్వహించారు.
వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రులు, మాజీ సీఎంలు తెలంగాణను చుట్టేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ప్రియాంక గాంధీ ఎన్నికల సభలు జరిగాయి. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలో రాహుల్ సభలు నిర్వహించారు.
Also Read:
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..
ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!