ఎన్నికల (Telangana Elections 2023) ప్రచారంలో భాగంగా ఈరోజు నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి కేటీఆర్ (Minister KTR). ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్షన్స్ రాగానే ఆగం కావొద్దు అని ప్రజలకు సూచించారు. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు ఇన్ని రోజులు జనంలో లేని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు పైసలు ఎక్కువై బలిసి కొట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కర్ణాటక కాంట్రాక్టర్ల నుంచి బాగా పైసలు వచ్చేసరికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి డబ్బు మదం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ALSO READ: కాంగ్రెస్ ఓడిపోతే నిరుద్యోగుల అడవి బాట.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓట్లు అడిగేందుకు సిగ్గు ఉండాలని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) కేసీఆర్ (KCR)ను నువ్వు కరెంట్ ఇచ్చినవా.. చూపించు? అని అడుగుతున్నాడని ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి నీకు సిగ్గు, ఇజ్జత్, మానం ఎమన్నా ఉన్నదా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండే కరెంట్ అని ప్రశ్నించారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు ఉండేవన్నారు. అర్థరాత్రి కరెంట్ పెట్టేందుకు పొలాలకు పోయి రైతులు సచ్చిపోయేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని నిప్పులు చెరిగారు.
మరోవైపు తెలంగాణలో ఎక్కువ మంది రైతులకు 3 నుంచి 4 ఎకరాల పొలాలు ఉన్నాయని.. వారికి 3 గంటల కరెంట్ సరిపోతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చే 3 గంటల కరెంట్ కావాలా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే 24గంటల ఉచిత కరెంట్ కావాలా? అని తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ తో నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. కరెంట్ కావాలంటే కారు గుర్తుకు ఓటు వెయ్యాలని.. దరిద్రం మీ ఇంటికి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని అన్నారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలు అంటే ఆరు నెలలకు ఒక సీఎం అని అర్థం అని సెటైర్లు వేశారు కేటీఆర్.
ALSO READ: KCR సినిమాకు షాక్ ఇచ్చిన ఈసీ.. కారణమిదే!