Dharani Explainer: ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?

ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ముందు ధరణి పోర్టల్‌ను రద్దు చేసి భూమాత పోర్టల్‌ను తీసుకువస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే.. ఇవాళ ప్రత్యేకంగా అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు.

New Update
Dharani Explainer: ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?

Dharani Portal: 'ధరణి'.. తెలంగాణ రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసిన అంశాల్లో ఇది ప్రాధానమైంది. ధరణితో రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబితే.. ధరణితో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అంతేకాదు.. రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ధరణిని ఎత్తేస్తామంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే ప్రచారం చేశారు. ధరణి ఒక లోపాల పుట్ట అని, భారీ స్కామ్స్ జరిగాయని ఆరోపిస్తూ ఆ పోర్టల్‌ను మార్చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల వేళ ప్రకటించినట్లుగానే.. ధరణిపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం రేవంత్. మరి ఆ ధరణి పోర్టల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ముందు ముందు తెలియనుంది. అయితే, ఇంతకీ ధరణిని గత ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చింది? దానితో ఎలాంటి లాభాలు ఉన్నాయంది? అందులో ఉన్న లోపాలేంటి? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? కీలక వివరాలను తెలుసుకుందాం..

ధరణి పోర్టల్‌ను ఎప్పుడు ప్రారంభించారంటే..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ(నాటి టీఆర్ఎస్ పార్టీ) అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి దఫాలో రైతు బంధు స్కీమ్‌ను ప్రవేశపెట్టారు నాటి సీఎం కేసీఆర్. మరో దఫా అధికారంలోకి వచ్చిన తరువాత.. రైతుల భూ సమస్యలను తొలగించే లక్ష్యంతో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారు. నాటి సీఎం చంద్రశేఖర్ రావు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయములో 29 అక్టోబర్ 2020న ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

ధరణి వల్ల లాభాలు..

ధరణి సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రములో ఉన్న వ్యవసాయ , వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్. ప్రభుత్వంలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని సేవలను ప్రజలకు అందించడమే ఈ పోర్టల్ ప్రధాన లక్ష్యం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించడం, భూమి, ఆస్తి సంబంధిత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిల్వ చేయడం, వ్యవసాయ భూముల నమోదు, వారసత్వం విభజనను సరళీకృతం చేయడానికి, మొత్తం రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తయ్యేలా చూడటానికి, ప్రజలకు ఇ-పట్టదార్ పాస్‌బుక్‌ను భూ యజమానులకు వెంటనే అందించడం ఈ పోర్టల్ స్పెషాలిటీగా ప్రభుత్వం చెప్పింది. ధరణి ప్రకారం.. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ కోసం.. తహసీల్దార్ ఉమ్మడి సబ్ రిజిస్ట్రార్లుగా, వ్యవసాయేతర ఆస్తుల ( ఇళ్ళు , స్థలములు ) వంటివి సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను చేస్తారు.

ధరణితో సమస్యలు..

డేటా సవరణ కోసం పెట్టుకున్న ఆన్‌లైన్‌ అర్జీలను పరిష్కరించకపోవడం, నిర్ణీత సమయంలో ఈ–పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను జారీ చేయకపోవడం, సర్వే కోసం ఎఫ్‌–లైన్‌ దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోకపోవడం, కాలవ్యవధి పాటించకపోవడం, వేలంలో కొనుగోలు చేసిన వారికి బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు జారీ చేసిన కొనుగోలు డాక్యుమెంట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం, ఏ కారణాలు చెప్పకుండా ఆన్‌లైన్‌/ఎఫ్‌–లైన్‌ దరఖాస్తులను తిరస్కరించడం, సెక్షన్‌ 7కు లిమిటేషన్‌ పీరియడ్‌ వివరంగా చెప్పకపోవడం, అమ్మకం, కొనుగోలు లావాదేవీలను సకాలంలో పూర్తి చేయడానికి ధరణిలో అప్‌లోడ్‌ చేసిన జనరల్, స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీలను పట్టించుకోకపోవడం, ఆర్వోఆర్‌ చట్టం సెక్షన్‌ 7లో పేర్కొన్న ‘కోర్టు డిక్రీ’ అనే దానిలో స్పష్టత లేకపోవడం, కోర్టు కేసులు, స్టే, ఇంజెంక్షన్‌ ఆదేశాల్లో వివాదం ఉన్న భూమి మాత్రమే కాకుండా.. సదరు సర్వే నంబర్‌లోని భూములన్నింటినీ నిషేధిత జాబితాలో పెట్టడం వంటివి సహా అనేక సమస్యలు ధరణిలో ఉన్నాయి. ఈ సమస్యల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ ఏం చేయబోతోంది..

ధరణిలో లోపాలు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తామని కూడా ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో ధరణి పోర్టల్‌ను తీసేసి.. దాని స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకువస్తామని పేర్కొన్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై ఫోకస్ పెట్టారు. ధరణిలోని లోపాల గురించి ఆరా తీస్తున్నారు. భారీ కుంభకోణం జరిగినట్లు భావిస్తోంది ప్రభుత్వం. మరి ధరణిపై రానున్న రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read:

ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.25 లక్షల వరకు ఫ్రీ!

యోగిని శాంభవి మళ్ళీ ప్రత్యక్షం.. వీరబ్రహ్మం గారిపై సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు