TG Power: తెలంగాణలో విద్యుత్ రగడ.. దీని వెనుక కథేంటి?

తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ అంశం హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ కు రూ.3.90లకే ఒప్పందమైన కరెంట్ సరాఫరా రూ.5.64 పైసలకు ఎలా చేరింది? కరెంటు రాకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ కు రూ.638 కోట్ల అదనపు ఛార్జీలు చెల్లించింది నిజమేనా? వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

TG Power: తెలంగాణలో విద్యుత్ రగడ.. దీని వెనుక కథేంటి?
New Update

TG Power Purchase Issue: తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ కొనుగోళ్ల అంశం కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య పెనుదుమారం రేగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా.. పవర్ కమిషన్ కేసీఆర్‌కు (KCR) నోటీసులు పంపించడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh) నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన చెల్లింపుల అంశం మొత్తం అడ్డదారిలోనే జరిగిందని, ఈ చెల్లింపులతో డిస్కంలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని డిస్కంలు చెబుతున్నాయి. మరోవైపు విద్యుత్తు శాఖలో ఇప్పటివరకు రూ. 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎం రేవంత్ కు వివరించగా.. దీనిపై పూర్తిస్థాయి వివరణ కోసం 2014 నుంచి ఇప్పటివరకు శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. ఈ క్రమంలోనే ట్రాన్స్​ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్​ రావు (Prabhakar Rao) ఇప్పటికే రాజీనామా చేయడంతో ఆయన రాజీనామాను ఆమోదించవద్దని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే రివ్యూకు ప్రభాకర్​ రావు కూడా హాజరుకావాలని ఆర్డర్​ వేయడం ఉత్కంఠ రేపుతోంది. ఇంతకు విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ఏం జరిగింది? కేసీఆర్ కరెంట్ తీసుకురాకున్నా వందలకోట్లు ఛత్తీస్ ఘడ్ కు చెల్లించింది నిజమేనా?

యూనిట్ రేటు డబుల్..
ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్‌ కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు వెల్లడించాయి. మార్కెట్‌లో చౌకగా కరెంటు లభిస్తుండగా అంతకుమించి సొమ్మును ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించినట్లు తెలిపాయి. ఒక్కో యూనిట్‌ను రూ.3.90లకే కొనేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం’(పీపీఏ) చేసుకుందని కేసీఆర్‌ జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డికి (Justice Narasimha Reddy) రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే చివరకు కరెంటు సరఫరా అయ్యే సమయానికి దాని ధర యూనిట్ కు ఐదు రూపాయల 64 పైసలుగా మారిందని, ఫలితంగా రూ. 3110 కోట్ల అదనపు భారం పడ్డట్లు వెల్లడించాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒక్కో యూనిట్‌ కరెంటు రావడానికి అయిన ఖర్చు రూ.5.64లకు చేరడంతో నష్టం వాటిల్లినట్లు డిస్కంలు పేర్కొన్నాయి. 2017 ఆఖర్లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు కరెంటు సరఫరా ప్రారంభమైంది. పీపీఏలో పేర్కొన్న వెయ్యి మెగావాట్లు ఎన్నడూ పూర్తిగా సరఫరా కాలేదు. బకాయిల చెల్లింపులపై వివాదంతో 2022 ఏప్రిల్‌ నుంచి సరఫరా నిలిచిపోయింది. ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2022 మధ్యకాలంలో సైతం పూర్తిస్థాయిలో కరెంటు రాకపోవడంవల్ల రూ.2,083 కోట్లు చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనాల్సి వచ్చిందని తెలంగాణ డిస్కంలు వెల్లడించాయి.

కరెంటు రాకున్నా రూ.638 కోట్ల అదనపు ఛార్జీలు..
అలాగే రూ.261 కోట్లు కట్టాలని పీజీసీఐఎల్‌ నోటీసు ఇచ్చింది. ‘ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు తెచ్చుకునేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఐఎల్‌)తో 1,000 మెగావాట్ల సరఫరాకు లైన్‌ కారిడార్‌ను అద్దెకు తీసుకునేందుకు తెలంగాణ డిస్కంలు రిజర్వు చేసుకోవాల్సి వచ్చింది. ఈ అద్దె భారం కూడా విద్యుత్తు సంస్థలపై పడింది. లైన్‌ బుకింగ్‌ ఒప్పందం ప్రకారం కరెంటు తెచ్చుకున్నా.. తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్‌కు ఛార్జీలు కట్టాల్సిందే. ఈ లెక్కన కరెంటు రాకున్నా రూ.638 కోట్ల అదనపు ఛార్జీలు కట్టారు. దీనికితోడు మరో 1000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్సుగా కారిడార్‌ను గత ప్రభుత్వం రిజర్వు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి అదనంగా మరో వెయ్యి మెగావాట్ల కరెంటు లభించే అవకాశం లేకపోవడంతో ఈ కారిడార్‌ను ఆ తర్వాత రద్దు చేసుకుంది. ఈలోగా జరగాల్సినంత నష్టం జరిగింది. ముందుగా రిజర్వు చేసుకున్నందువల్ల పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని డిస్కంలకు పీజీసీఐఎల్‌ నోటీసులు జారీ చేసింది. కారిడార్‌ రిజర్వు ఒప్పందం హడావుడిగా చేసుకోవటం వల్లే ఈ అదనపు చెల్లింపుల సమస్య తలెత్తింది’ అని జ్యుడిషియల్‌ కమిషన్‌కు డిస్కంలు తెలిపాయి.

నష్టం ఎలా వాటిల్లిదంటే..
ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్‌ కొనుగోలు ధర రూ.3.90 మాత్రమే అని కేసీఆర్‌ తెలిపారు. కానీ 2017 - 2022 వరకు కొన్న 17,996 మిలియన్‌ యూనిట్లకు ఛత్తీస్‌గఢ్‌కు తెలంగాణ డిస్కంలు రూ.7,719 కోట్లు చెల్లించాయి. ఇంకా రూ.1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని డిస్కంలు తెలిపాయి. కరెంటు సరఫరా(ట్రాన్స్‌మిషన్‌) లైన్‌ ఛార్జీలు రూ.1,362 కోట్లు దీనికి అదనంగా పేర్కొన్నాయి. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్‌ ఖర్చు రూ.5.64 అయిందని, ఒప్పందం ప్రకారం రూ.3.90 చొప్పున చెల్లించాల్సిన ధరతో పోలిస్తే దాదాపు రూ.3,110 కోట్ల అదనపు భారం పడిందని స్పష్టం చేశాయి. బకాయిలపై రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య వివాదం ఇంకా తేలకపోగా.. రూ.1,081 కోట్ల బకాయిలున్నాయని తెలంగాణ డిస్కంలు చెబుతున్నాయి. మరోపక్క రూ.1,715 కోట్లు ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు సంస్థలు చెబుతుండటం విశేషం. కాగా దీనిపై మరికకొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

#kcr #cm-revanth-reddy #telangana-chhattisgarh #power-agreement
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe