దద్దరిల్లిన తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశం.. చలికాలంలో చెమటలు పట్టించిన చర్చ..!

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశం చలికాలంలోనూ మంట పుట్టించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

New Update
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైన సమావేశాలు 21వ తేదీ వరకు కొనసాగాయి. 6 రోజుల పాటు జరిగిన తెలంగాణ మూడవ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య పెద్ద యుద్ధమే సాగింది. మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో సభ్యులు చేసిన ప్రసంగాల సంఖ్య 19. వీరిలో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, విపక్ష నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కడియం శ్రీహరి, బీజేపీ నేతలు, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సహా పలువురు నేతలు ప్రసంగించారు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశంలో చర్చ హాట్ హాట్‌గా జరిగాయి. తొలి మూడు రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం సాధారణంగా జరుగగా.. ఆ తరువాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం నుంచి సభ చలికాలంలోనూ ఉతక్కపోత పెట్టించింది. నేతల మధ్య జరిగిన వాడి వేడి చర్చ.. యావత్ తెలంగాణను అటెన్షన్ మోడ్‌లోకి తీసుకువచ్చింది. గవర్నర్ ప్రసంగంలోనే గత ప్రభుత్వాన్ని నిందిస్తూ పేర్కొనడం, ఆ ప్రసంగాన్ని అధికర కాంగ్రెస్ సమర్థించగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ అంశం ముగియగానే.. ప్రభుత్వం మరో ఆయుధం ఎక్కుపెట్టింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసింది. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులు ఇవీ అంటూ 40 పేజీలకు పైగా ఉన్న బుక్‌లెట్‌ను సభలో ప్రవేశపెట్టింది. డిపార్ట్‌మెంట్ వైజ్‌గా ఎంత అప్పులు చేశారనే అంశంపై వివరించింది ప్రభుత్వం. అయితే, అధికార పక్షానికి ధీటుగా బదులిచ్చింది విపక్ష బీఆర్ఎస్. అవి అప్పులు కాదు ఆస్తులు అంటూ కౌంటర్ బుక్‌లెట్ విడుదల చేసింది. అప్పులు చెబుతున్నారే తప్ప.. వాటిని ఎందుకు ఖర్చు చేశారో చెప్పడం లేదంటూ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు విపక్ష నేతలు. ఇక అసెంబ్లీ చివరి రోజున విద్యుత్ శాఖలో అప్పుల అంశంపై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఒకానొక దశలో సభ్యులు వ్యక్తిగత విమర్శలకు దిగడం.. సంచలనం రేకెత్తించింది. మొత్తంగా ఈ చర్చల ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

సభకు హాజరు కాని కేసీఆర్..

తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ఎల్పీ నేగా కేసీఆర్ ను ఎన్నికున్నారు ఆ పార్టీ సభ్యులు. అయితే, తొలి సమావేశాలకు కేసీఆర్ హాజరవ్వలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. తన ఇంట్లో కాలు జారి పడిపోవడంతో కేసీఆర్ కాలు విరిగింది. దాంతో ఆయనకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఆ కారణంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఇంకా విశ్రాంతిలోనే ఉన్నారు. కోలుకున్న తరువాత మరుసటి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

బీజేఎల్పీ నేత లేకుండానే..

గత ప్రభుత్వ సమయంలో బీజేఎల్పీ నేత లేకుండానే ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది బీజేపీ. గత ప్రభుత్వ కాలంలో బీజేఎల్పీ నేతగా ఎమ్మెల్యేగా రాజాసింగ్ ను నియమించింది బీజేపీ. అయితే, ఆయనపై నమోదైన కేసులు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేఎల్పీ నేతగా తొలగించడంతో పాటు.. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎన్నికల వేళ ఆయనపై ఉన్న సప్పెన్షన్ ను ఎత్తేసిన బీజేపీ.. గోషామహల్ టికెట్ ఇచ్చింది. తాజా ఎన్నికల్లో రాజాసింగ్ మళ్లీ గెలిచారు. అయితే, ఆయనకు బీజేఎల్పీ నేతగా అవకాశం ఇవ్వలేదు. కానీ, ఆయన తనకే బీజేఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో అలకబూనిని రాజాసింగ్.. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవలేదు. దీంతో ఈ సెషన్ లో బీజేఎల్పీ నేత లేకుండానే ఆ పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు.

Also Read:

దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా..

విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు..

Advertisment
Advertisment
తాజా కథనాలు