/rtv/media/media_files/2026/02/09/human-city-on-the-moon-2026-02-09-10-58-28.jpg)
స్పేస్‌ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇప్పటివరకు అంగారక గ్రహంపై నగరాన్ని నిర్మించాలని కలలుగన్న మస్క్, ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. రాబోయే పదేళ్లలోపే చంద్రునిపై నగరాన్ని నిర్మించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంగారకుడి కంటే చంద్రుడే ఎందుకు?
ఇంతకాలం మార్స్ మిషన్ గురించి మాట్లాడిన మస్క్, అకస్మాత్తుగా మూన్ వైపుకు మళ్లడానికి బలమైన కారణాలను వెల్లడించారు.
ప్రయాణ సమయం: అంగారక గ్రహానికి వెళ్లాలంటే గ్రహాల అమరిక కుదిరే వరకు (ప్రతి 26 నెలలకు ఒకసారి) వేచి చూడాలి. కానీ చంద్రునిపైకి ప్రతి 10 రోజులకు ఒకసారి రాకెట్లను పంపవచ్చు.
వేగం: అంగారకుడిపై నగరం నిర్మించడానికి 20 ఏళ్లకు పైగా సమయం పడుతుంది, అదే చంద్రునిపై అయితే 10 ఏళ్లలోపే సాధ్యమవుతుందని మస్క్ 'X' వేదికగా పేర్కొన్నారు.
'లూనార్ బేస్ ఆల్ఫా' - మస్క్ మాస్టర్ ప్లాన్
స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేస్తున్న భారీ రాకెట్ స్టార్‌షిప్ ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించనుంది. 2028 నాటికే చంద్రునిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని మస్క్ భావిస్తున్నారు. స్టార్‌షిప్ రాకెట్లనే మొదట అక్కడ నివాసాలుగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే చంద్రునిపై ఉన్న మంచును నీరుగా, ఇంధనంగా మార్చుకోవాలనుకుంటున్నారు. చంద్రుని మట్టితోనే అదనపు కట్టడాలను నిర్మించాలని ప్లాన్ ఇందులో ఉంది.
అమెరికా ప్రభుత్వ సహకారం
ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా అంగారకుడి కంటే చంద్రునిపైనే ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నాసా చేపట్టిన 'ఆర్టెమిస్' ప్రోగ్రామ్ ద్వారా 2028 నాటికి అమెరికన్లను మళ్ళీ చంద్రునిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి స్పేస్‌ఎక్స్ ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తోంది.
ఎదురైయ్యే సవాళ్లు-
చంద్రునిపై వాతావరణం లేకపోవడం, రేడియేషన్ ముప్పు వంటి అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, మస్క్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. "మానవ నాగరికత మనుగడ సాగించాలంటే మనం ఇతర గ్రహాలపై స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి, దానికి చంద్రుడే తొలి మెట్టు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అంతరిక్ష ప్రయోగాల్లో మళ్ళీ కొత్త ఉత్సాహం నెలకొంది.
Follow Us