ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ షాక్.. 1.75 కోట్ల మంది డేటా లీక్?

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డేటా లీక్ అయిందని వార్తలతో యూజర్లు ఆయోమయంలో పడిపోయారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.75 కోట్ల (17.5 మిలియన్ల) మంది యూజర్లకు సంబంధించిన సెన్సిటీవ్ డేటా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ మాల్వేర్ బైట్స్ తాజా నివేదికలో వెల్లడించింది.

New Update
Instagram data leaked

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ షాక్. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డేటా లీక్ అయిందని వార్తలతో యూజర్లు ఆయోమయంలో పడిపోయారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.75 కోట్ల (17.5 మిలియన్ల) మంది యూజర్లకు సంబంధించిన సెన్సిటీవ్ డేటా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ మాల్వేర్ బైట్స్ తాజా నివేదికలో వెల్లడించింది.

డేటా లీక్ ఎలా జరిగింది?

సైబర్ నిపుణుల సమాచారం ప్రకారం, ఈ డేటా హ్యాకింగ్ ద్వారా కాకుండా API (Application Programming Interface)లో ఉన్న లోపాలను ఉపయోగించుకుని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ డేటా 2024 నాటి API లీక్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇన్‌ఫర్మేషన్ డార్క్‌వెబ్‌లోని 'బ్రీచ్ ఫోరమ్స్' వంటి వేదికల్లో అమ్మకానికి అందుబాటులో ఉందని నివేదికలు చెబుతున్నాయి.

లీక్ అయిన సమాచారం ఏమిటి?

హ్యాకర్లు సేకరించిన సమాచారంలో యూజర్ల పూర్తి పేర్లు, యూజర్ ఐడీలు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, ఫిజికల్ అడ్రస్‌లు, లొకేషన్ వివరాలు ఉన్నట్లు గుర్తించారు.

పాస్‌వర్డ్ రీసెట్ మెసేజ్‌లతో అలజడి
గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఈమెయిల్ ఐడీ నుంచి "Password Reset" కోరుతూ మెసేజ్‌లు వస్తున్నాయి. యూజర్లు తాము అడగకుండానే ఇలాంటి మెసేజ్‌లు రావడంతో ఆందోళన చెందుతున్నారు. హ్యాకర్లు సేకరించిన ఈమెయిల్ ఐడీలను ఉపయోగించి ఖాతాలను హ్యాక్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రీసెట్ లింక్‌లను పంపిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి నిపుణులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.

పాస్‌వర్డ్ మార్చుకోండి: వెంటనే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను మార్చండి. ఇది గతంలో వాడిన వాటికి భిన్నంగా, క్లిష్టంగా ఉండేలా చూసుకోండి.
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA): మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను తప్పనిసరిగా ఆన్ చేసుకోండి. దీనివల్ల హ్యాకర్ల వద్ద మీ సమాచారం ఉన్నా, మీ అనుమతి లేకుండా అకౌంట్ లాగిన్ చేయలేరు.
అపరిచిత లింక్‌లను క్లిక్ చేయవద్దు: మీకు ఇన్‌స్టాగ్రామ్ నుండి పాస్‌వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వస్తే, మీరు స్వయంగా కోరనంత వరకు వాటిని క్లిక్ చేయకండి.
థర్డ్ పార్టీ యాప్స్: మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో అనుసంధానించబడిన అనవసరమైన థర్డ్ పార్టీ యాప్‌లను తొలగించండి.
మెటా సంస్థ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు