Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరం ప్రాజెక్టు పాపాల పుట్ట అని రాష్ట్ర మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.50వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని తెలిపారు. కమీషన్ల కోసం నాసిరకంగా నిర్మాణాలు చేశారని కుండబద్దలు కొట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, మిగిలిన రెండు బ్యారేజీలకు బొక్కలు పడ్డాయని.. వాటి భద్రత కూడా ప్రశ్నార్థకమేనని ఫైరయ్యారు. ప్రాజెక్టు కూలిపోయిన ఘటనలో బాధ్యులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు తిన్న అవినీతి సొమ్ము మొత్తాన్ని కక్కిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరంపై సీఎంతో చర్చించాక జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలిస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వినోద్‌లు శుక్రవారం నాడు మేడగడ్డ బ్యారేజీని పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులకు పలు ప్రశ్నలు సంధించి వివరాలు తెలుసుకున్నారు. ఏడు పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు. కమీషన్ల కోసం మొత్తం నాసిరకం నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. బ్యారేజ్ నిర్మాణాలను పరిశీలిస్తే 3 ఏళ్ల క్రితం కట్టిన వాటిలా కనబడటం లేదని తెలిపారు. మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఖాళీగా ఉన్నాయని.. నీటిని నింపే పరిస్థితి లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి కంపు కొడుతోందని విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకూ దాదాపు 1 లక్ష 5వేల కోట్లు ఖర్చు చేశారని.. కేవలం లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం అప్పుల వడ్డీ భారమే ఏటా రూ.10వేల కోట్లు కట్టాల్సి ఉందని తెలిపారు. ఇది కాకుండా ప్రాజెక్టు నిర్వహణకు ప్రతి ఏటా మరో రూ.10వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. కేంద్ర జలసంఘం రూపొందించిన ప్రాజెక్టు అంచనాలను.. రూ.65వేల కోట్ల మేర పెంచి ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ప్రాజెక్టు పర్యటన వివరాలను సీఎంకు వివరిస్తామని.. తదుపరి చర్యలు చేపడతామన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణపై ఇప్పుడేమీ చెప్పలేమని, నిపుణులతో చర్చించాకే ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు.
ప్రమాదంలో 3 బ్యారేజీలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టు కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారని, లక్ష ఎకరాలకంటే తక్కువ ఆయకట్టు ఉందన్నారు మంత్రి. గత ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం పనులు చేయించిందని ఆరోపించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, ఈ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులకు ఏడాదికి 10 వేల కోట్లు వడ్డీని తెలంగాణ ప్రజలు కట్టాల్సి వస్తోందన్నారు. అక్టోబర్ 21న పిల్లర్ కూలిపోతే.. కేసీఆర్ కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి తమకు అనుమానాలున్నాయని, మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ విచారణ జరుపుతామని శాసన సభలోనే ప్రకటించామన్నారు. కాళేశ్వరం కంటే ప్రాణహితే ఉత్తమమైనదని తెలిపారు. మూడేళ్లలోనే ప్రాజెక్టు కుంగిపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు కట్టిన వారే ఈ ఘటనకు బాధ్యులు అని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ కట్టిందన్న మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం లాంటి నాణ్యత లేని ప్రాజెక్టును ఎక్కడా కట్టలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులలో అన్నీ లోపాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు. మూడేళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులా లేనే లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును మళ్ళీ చేపట్టి వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగామని గత ప్రభుత్వం చెప్పింది కానీ, తెలంగాణ నుంచి అధికారికంగా ఎలాంటి అభ్యర్థన రాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. జాతీయ హోదా విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేశాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ హోదా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలిసి అడిగారు. పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా కోసం కొట్లాడతామని, ప్రాణహిత ప్రాజెక్టును చేపడతామన్నారు. మేం లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు ఈఎన్సీ లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అలాగే, పాలమూరు రంగరెడ్డి ప్రాజెక్ట్ విషయంలో జాతీయ హోదా కోసం పోరాటం చేస్తామన్నారు మంత్రి.
బాధ్యులపై చర్యలు తప్పవు: మంత్రి శ్రీధర్ బాబు
“కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పలు బ్యారేజీలకు జరిగిన డ్యామేజీపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరగడానికి ముందే థర్డ్ పార్టీ ఏజెన్సీతో దర్యాప్తు జరగాలి. జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరిగి నివేదిక రావడానికి సమయం పట్టొచ్చు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో దాదాపు 90% ఒక్క కాళేశ్వరం మోటారు పంపుసెట్లకే వాడాల్సి వస్తున్నది. ఒక్కో ఎకరానికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వడానికి రూ.46 వేల ఖర్చు అవుతుంది. ఒక్కో యూనిట్ కరెంటుకు రూ.6.40 బిల్లింగ్ జరిగితే దాన్ని గత ప్రభుత్వం రూ.3గా చూపెట్టింది. ఐదేండ్లలో కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ అయిన నీరెంత?.. తిరిగి సముద్రంలోకి చేరిందెంత? మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో 50 టీఎంసీలు నిల్వ చేస్తున్నా అక్కడ భూకంప తీవ్రతపై స్టడీ జరిగిందా? బాహుబలి పంపుల కొనుగోలులో జరిగిన గోల్మాల్ ఏంటి? మంథని, చెన్నూరు ప్రాంతాల్లో ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లింపు సంగతేంది?” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను ప్రజలకు వివరించాలన్నదే మా ఉద్దేశమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజల సంపద సరైన విధంగా ఖర్చు చేశారా? లేదా? అన్నది చూడాలన్నారు. ఇంజినీర్లు, అధికారులపై మాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదన్నారు. బ్యారేజీకి జరిగిన డ్యామేజీలో బాధ్యులెవరైనా చర్యలు తప్పవని తెలిపారు. బ్యారేజీకి జరిగిన డ్యామేజీకి దారితీసిన కారణాలను అధికారులే వివరించాలన్నారు. జలాశయాల్లో నీరు నిల్వ చేసినపుడు ముంపు సమస్య ఉంటుందని, కరకట్టలు నిర్మించి ముంపు సమస్య నివారిస్తామన్నారు. అవసరమైన చోట భూసేకరణ చేసి రైతులకు సహాయ, పునరావాసం కల్పించాలని శ్రీధర్‌బాబు తెలిపారు. ఇరిగేషన్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో స్వయంగా బ్యారేజీని పరిశీలించామన్నారు.
ఇది విఫల ప్రయోగం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే రూ.40 వేల కోట్లు ఆదా అయ్యేవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇక్కడే ఎందుకు చేపట్టారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్‌ను ఇంజనీర్ ఇన్‌చీఫ్ చేశారా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టిన సమయంలోనే మీరు లీవ్ పెట్టి ఉండాల్సిందని ఇంజనీర్ ఇన్చీఫ్పై ఫైర్ అయ్యారు. అసెంబుల్డ్ మోటార్లు తెచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. అప్పటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. కాంగ్రెసుకు పేరు వస్తుందని కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా ఒక విఫల ప్రయోగమని దుయ్యబట్టారు. వైఎస్సార్ హయాంలోని ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును తుమ్మడిహట్టి దగ్గరే కట్టి ఉంటే ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే సాగునీరు అంది ఉండేదని తెలిపారు. దీని ద్వారా రైతులకు లాభం జరిగేదని.. గత ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యంతోనే ఖజానాపై భారీగా భారం పడి ప్రజాధనం దుర్వినియోగమైందని మండిపడ్డారు. వెయ్యి కోట్లకు వచ్చే మోటార్లకు నాలుగు రెట్లు గత ప్రభుత్వం ఎక్కువ చెల్లించిందని.. నాణ్యతలేని లోకల్ అసెంబ్లింగ్ మోటార్లను అమర్చిందని ఆరోపించారు. ఇంజనీర్లు, అధికారులు గత ప్రభుత్వానికి చెప్పి ఉండాల్సిందని సలహాలు ఇవ్వాల్సి ఉండేనని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల పనులను చూస్తుంటే బాధగా ఉన్నదని.. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని.. ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు.
మొత్తం నాణ్యతా లోపమే: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
152 మీటర్ల లెవల్లో తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ సీఎం రాజశేఖరరెడ్డి కృషి చేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని, చర్చల దశలో ఉండగానే పరిస్థితులు మారిపోయాయని అన్నారు. ఆ తర్వాత 148 మీటర్ల ఎత్తులో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని, డిజైన్ లోపం వల్లే కాళేశ్వరం కుంగిందని పేర్కొన్నారు. ఆనాడు జాగ్రత్తలు తీసుకొని ఉంటే, ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారని, ఇది ఒకట్రెండు పిల్లర్లతో ఆగిపోదని తెలిపారు. ప్రాజెక్టు అంతా నాణ్యతా లోపమేనని వ్యాఖ్యానించారు. ఇది అప్పులు చేసి కట్టిన ప్రాజెక్టు అని, పంపులు మునగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. వందలాది కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని, దీనికి కారణం ఎవరని నిలదీశారు.
లక్ష కోట్టు ఖర్చు చేసినా ఫలితం సున్నా : పొన్నం ప్రభాకర్
కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వానికి మానసపుత్రిక అయ్యిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కనీసం చూసేందుకు కూడా వీలు లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారని ప్రచారం చేశారన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి ఫలితం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో రైతాంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వివేక్ సైతం స్పందించారు. తుమ్మడి హెట్టి దగ్గర నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలమయంగా తయారైందని విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యకు పరిష్కారం చూపాలని, బ్యాక్ వాటర్‌లో పంటలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
సగానికి పైగా సొమ్ము దోపిడీ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ. 50 వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రమాదానికి గురైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రుల బృందం పర్యటనకు వెళ్లింది. మంత్రులతో పాటుగా జీవన్ రెడ్డి సైతం మేడిగడ్డ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టుకు చేసిన రూ. లక్ష కోట్ల సగానికి పైగా (రూ.50 వేల కోట్లు) అవినీతి జరిగింది. దీనిపై సమగ్రమైన విచారణ జరగాలి. థర్డ్ పార్టీ ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలి. జ్యుడిషియల్ విచారణ సమాంతరంగా వేరేగా జరుగుతుంది. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. థర్డ్ టీఎంసీ ప్లానింగ్‌లోనే లోపమున్నది. ప్రజల భూములు పోయాయి. వాటికి పరిష్కారమేంటి? కాళేశ్వరానికి జరిగిన ఖర్చులో ఎల్లంపల్లికి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఎంతెంత అయింది?” అని ప్రశ్నించారు.
Also Read:
సూర్యుడి రథంలో 7 గుర్రాలే ఎందుకుంటాయి? ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..!