Peddapalle District : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ దగ్గర మానేరు వాగు (Maneru Bridge) పై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో క్వాలీటీ లేదని మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబర్ పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్దశబ్దంతో కిందపడ్డాయని స్థానికులు తెలిపారు.
2016లో ఆగస్ట్ నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి జిల్లా (Bhupalapally District) పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించేందుకు ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణ సమయంలో వచ్చిన వరదలకు సామాగ్రి దెబ్బతినడం, కాంట్రాక్టర్లు మారడంతో పనులు లేట్ అవుతున్నాయి. రెండేళ్లుగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో గడ్డర్లు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1,2 నంబరు పిల్లర్ల నాలుగు గడ్లర్లు కిందపడ్డాయి. ఇప్పుడు మరో ఐదు గడ్డర్లు కిందపడడంతో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.