ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘బేబి’ మూవీ (Baby Movie).. బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకుంది. అందులోనూ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేకపోవడంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండ (Anand devarakonda), వైష్ణవి చైతన్య (Heroine VaishnavI), విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని.. సాయి రాజేష్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బేబి మూవీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్(Director Sai Rajesh) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వైష్ణవీనే తీసుకోవడానికి ఓ కారణం ఉందన్నారు. ఈ మూవీ అనుకున్నప్పుడు హీరోయిన్ గా ఓ తెలంగాణ అమ్మాయి కావాలని అనుకున్నానని చెప్పారు. తెలంగాణ భాష మీద బాగా పట్టుండాలి.. అలాంటి అమ్మాయి అయితే నా కథకి పూర్తి న్యాయం చేస్తుందని భావించానని తెలిపారు.
ఈ క్రమంలో మా మేనేజర్ వైష్ణవి ఫోటో చూపించారు.. దీంతో వెంటనే నేను తనని సంప్రదించాను. ఫస్ట్ వైష్ణవికి ఈ కథ చెప్పినప్పుడు అస్సలు ఒప్పుకోలేదన్నారు. తర్వాత నేను తీసే సన్నివేశాలు ప్రతి ఒక్క షాట్ ను ఆమెకి బాగా వివరించాను.. అందులో నీకు నచ్చకుంటే మళ్లీ వేరే షాట్ తిద్దామని చెప్పడంతో వైష్ణవి ఒప్పుకున్నట్లు సాయి రాజేష్ తెలిపారు.
ఆ తర్వాత డైరెక్ట్ గా షూటింగ్ కు వెళ్లిపోయాం.. నేను చెప్పిన ప్రతి సీన్ లో వైష్ణవి ఎంతో చక్కగా నటిచింది.. వైష్ణవి ఫ్యూచర్ లో మంచి హీరోయిన్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఇంత మంచిగా రావడానికి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు సాయి రాజేష్.