CM Revanth Reddy: ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సచివాలయంలో సమావేశం కానున్నారు. దీనికి తగిన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ దృష్టి పెట్టింది. సచివాలయంలోని ఏడో అంతస్తులోని వెస్టర్న్ డోమ్‌లో ఈ సమావేశం జరగనుంది. క్షేత్రస్థాయిలోని సమస్యలను ఈ భేటీలో తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై కూడా చర్చ జరపనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రేషన్ కార్డులు, రెవెన్యూ తో పాటి ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజాపాలన’ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకై ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చడం, జవాబుదారీగా ఉండేందుకై ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు (సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి సాయంత్రం 6 గంటలవరకు ఈ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి.
ALSO READ: టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..
ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్/ కార్పొరేటర్/ కౌన్సిలర్ లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు.
ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు.