లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓ బీజేపీ కసరత్తులు చేస్తూంటే.. మరోవైపు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంగా విపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రాంతీయ పార్టీలకు ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. అందుకే మిగిలిన పార్టీలన్నీ ఇండియా బ్లాక్‌లో ఉండాలని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నానని చెప్పారు.
Also read: ఎన్నారై వివాహాలకు సంబంధించి.. కేంద్రానికి న్యాయ కమిషన్ కీలక సిఫార్సులు
అస్థిత్వానికి సంక్షోభం
ఆయన కొత్త పుస్తకం ‘ది వాటర్‌షెడ్ ఇయర్-ఇండియా ఏ మార్గంలో వెళ్తోంది?’పై అన్న దానిపై పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పీటీఐతో మాట్లాడారు. ఇండియా బ్లాక్ కూటమి కమిటీలో తాను లేనని పేర్కొన్నారు. అందుకే ఈ కూటమి భవిష్యత్తుపై తాను ఏమి చెప్పలేన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల ఉనికికి సంక్షోభం కలుగుతుందని వ్యాఖ్యానించారు.
కాలమే సమాధానం చెబుతుంది
ఈ నేపథ్యంలోనే మిగిలిన పార్టీలు.. ఇండియా బ్లాక్‌లో ఉండాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. అలాగే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య రామమందిరం కూడా ఒక అంశంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే ఇది నిర్ణయాత్మకమైనదేనా అనే విషయానికి కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. సుస్థిరమైన, బలమైన రాజకీయ పార్టీలతోనే కాంగ్రెస్.. ఇండియా కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇదిలాఉండగా.. మరో రెండు,మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇంతవరకు ఈసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏప్రిల్ నెలలో ఈ ఎన్నికలు ఉండొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: మాపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదు.. రైతు సంఘాల హెచ్చరిక