India : అఫ్ఘాన్ క్రికెట్ టీమ్ (Afghanistan Cricket Match) సెమీస్‌లో ఓడినా ఆ జట్టు సాధించిన విజయాలు మాత్రం క్రీడాభిమానుల్లో స్పూర్తి నింపాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) లో అఫ్ఘాన్ సాధించిన గెలుపు చూసి యావత్ క్రికెట్ ప్రపంచం వారికి సెల్యూట్ చేసింది. అఫ్ఘాన్ క్రికెట్ జట్టు మన కళ్ల ముందే ఎదిగింది.. మన కళ్ల ముందే అద్భుతాలు చేసింది. ఓవైపు తమగడ్డపై అగ్రదేశాల దాష్ఠికాలు.. మరోవైపు 50ఏళ్లకు పైగా యుద్ధాలతో బలైపోయిన అఫ్ఘానిస్థాన్ క్రికెట్‌లో ఎదిగిన తీరు నిజంగా అసమాన్యమనే చెప్పాలి. టీ20 వరల్డ్‌కప్‌లో అఫ్ఘాన్ విజయాల తర్వాత చాలామంది ఆ జట్టు అభిమానులు బీసీసీఐకు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు థ్యాంక్స్ చెప్పారు. ఇంతకీ ఈ రెండు బోర్డులను అఫ్ఘాన్ ఫ్యాన్స్ ఎందుకు గుర్తుచేసుకున్నారు..?
పాక్ చేసిన సాయమేంటి?
తాలిబన్ల నుంచి 2001లో ప్రజాపాలనకు వెళ్లిన అఫ్ఘానిస్థాన్‌కు తొలి రోజుల్లో క్రికెట్ పరంగా పాకిస్థాన్ (Pakistan) నుంచి సపోర్ట్ లిభించింది. నిజానికి 1980లో అఫ్ఘాన్‌లో రష్యా మితిమీరిన జోక్యం తర్వాత అక్కడి వారు పాకిస్థాన్‌కు వలసపోయారు. అక్కడే క్రికెట్ నేర్చుకున్నారు.. తర్వాత 1995లో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు (ACB) ఏర్పడింది. అయితే తాలిబన్లు మాత్రం క్రికెట్‌ను నిషేధించారు. దీంతో 2001వరకు పాకిస్థాన్‌లో శరణార్థులగానే మహ్మద్ నబీ లాంటి ఆటగాళ్లు నివసించారు. ఆ తర్వాత అఫ్ఘాన్‌కు తిరిగి వచ్చారు. ఆ సమయంలో అఫ్ఘాన్‌కు ఐసీసీ(ICC) అనుబంధ సభ్యదేశంగా గుర్తింపు ఇప్పించడంలో పాక్ బోర్డు సాయం చేసింది.
బీసీసీఐ చేసిన సాయమేంటి?
అటు 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అఫ్ఘాన్ క్రమక్రమంగా ఎదిగింది. అయితే అఫ్ఘాన్ సహజంగా పేద దేశం కావడంతో సౌకర్యాల లేమితో అఫ్ఘాన్ క్రికెట్ ఇబ్బందులు పడింది. ఈ సమయంలో ఇండియాలోనే ఆడుకునేందుకు హోం గ్రౌండ్ ఇచ్చింది బీసీసీఐ. గ్రేటర్ నోయిడా క్రికెట్ గ్రౌండ్‌ను అఫ్ఘాన్‌కు ఇచ్చింది. అక్కడే అఫ్ఘాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునే వాళ్లు. అంతే కాదు మాజీ క్రికెటర్లు లాల్‌చంద్ రాజ్‌పుత్, అజయ్ జడేజా (Ajay Jadeja) లాంటి ఆటగాళ్లను కోచ్‌లగా, మెంటర్లగా పంపింది. వీరంతా అఫ్ఘాన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అజయ్ జడేజా అఫ్ఘాన్ క్రికెట్ టీమ్‌కు సేవలందించింనందుకు కనీసం ఒక్క రూపాయ్ మ్యాచ్ ఫీజ్ కూడా తీసుకోలేదు. అటు ఐపీఎల్ ద్వారా అఫ్ఘాన్ క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: ఇక చాలు.. పోయి బెంచ్‌పై కుర్చో.. ఇదేం ఐపీఎల్ కాదు..!