Fans Says Sorry To Pandya : ఎన్నెన్ని మాటలు అన్నారు.. ఎంత బాధను భరించాడు.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ను ఇష్టపడే వారి కంటే ద్వేషించే వారే ఎక్కువ. ఎందుకంటే రోహిత్‌పై ఉన్న ప్రేమ పాండ్యాపై ద్వేషంగా మారేలా చేసింది ఐపీఎల్. రిచెస్ట్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ 2023 డిసెంబర్ నుంచి మొన్న మే లో ముగిసిన ఐపీఎల్-2024 (IPL - 2024) వరకు రోహిత్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ జెండాలను కూడా తగలబెట్టారు. పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు. ఇదంతా స్టేడియంలోనూ కనిపించింది. ముంబై ఇండియన్స్‌కు పాండ్యా కెప్టెన్సీ చేస్తున్న సమయంలో, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ ఫ్యాన్స్ 'బూ' సౌండ్స్ చేశారు. అయితే సరిగ్గా నెల రోజుల్లో సీన్ మొత్తం మారిపోయింది. పాండ్యాను తిట్టిన ఆ నోర్లే ఇప్పుడు అతడిని మెచ్చుకుంటున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంతో పాండ్యాది కీలక పాత్ర. ఫైనల్‌లోనూ ఫైనల్ ఓవర్ వేసిన పాండ్యా టీమిండియాను గెలిపించి అందరి చేత జేజేలు అందుకున్నాడు.
ఆటతోనే మనసు దోచుకున్నాడు:
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ (T20 World Cup Final) లో ఆఖరి ఓవర్‌లో సౌతాఫ్రికా 16పరుగులు చేయాల్సి ఉంది. ఈ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన పాండ్యా దక్షిణాఫ్రికాను అద్భుతంగా నిలువరించాడు. ఇండియా మ్యాచ్ గెలిచిన వెంటనే ముందుగా అందరూ ఆనందాల్లో మునిగిపోయిన సమయంలో పాండ్యా మాత్రం కన్నీరు కార్చాడు. ఇది ఆనందంతో వచ్చిన కన్నీళ్లు మాత్రమే కాదు.. అతని కంటిలో నుంచి వచ్చిన ప్రతీ కన్నీటి చుక్క వెనుక అంతులేని వేదన ఉంది. అతడిని గేలీ చేసిన అభిమానులకు ఏనాడూ నోటితో కానీ సైగతో కానీ సమాధానం చెప్పని పాండ్యా కేవలం ఆటతీరుతోనే వారి మనసును గెలుచుకున్నాడు.
బౌన్స్ బ్యాక్ అంటే ఇదే:
ఓవైపు ఐపీఎల్‌లో రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు అప్పుడప్పుడే గాయాల నుంచి కోలుకున్న శరీరం.. ఇంకోవైపు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు.. ఇవేవీ పాండ్యా ఆటను ఏ మాత్రం దెబ్బతియ్యలేదు. గతంలో ఎలా అయితే ఆడేవాడో ఈ వరల్డ్‌కప్‌లోనూ అలానే ఆడాడు. నిజానికి ఆల్‌రౌండర్‌గా క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా ఆ తర్వాత కాలంలో బౌలింగ్‌లో లయ తప్పాడు. బ్యాటింగ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. దీంతో కేవలం బ్యాటర్‌గా పాండ్యాను జట్టులోకి తీసుకోవడం అవసరం లేదన్న అభిప్రాయాలు వినిపించాయి. అందులోనూ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ఐపీఎల్‌లోనూ పాండ్యా విఫలమయ్యాడు. అయినా సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. ఏకంగా వైస్ కెప్టెన్‌గా జట్టులోకి తీసుకున్నారు. సెలక్టర్లు తీసుకున్న ఆ నిర్ణయం ఎంత కరెక్టో పాండ్యా తన ఆటతోనే నిరూపించాడు. అటు వైస్ కెప్టెన్‌గా కెప్టెన్ రోహిత్‌కు ఎంతో సహాకారం అందించాడు.
ఒక్క ముద్దుతో..:
ఇక ఐపీఎల్ కెప్టెన్సీ ఎపిసోడ్‌పై ఏనాడు స్పందించని రోహిత్ మ్యాచ్ గెలిచిన తర్వాత పాండ్యాకు పెట్టిన ముద్దుతో అందరికి సమాధానం దొరికినట్టయ్యింది. అలకలు, మనస్పర్థలు ఎక్కడైనా సర్వసాధారణమే.. అవి సొంత కుటుంబంలోనూ ఉంటాయి.. ఈ విషయం అటు పాండ్యా-రోహిత్‌కు తెలియనది కాదు.. అందుకే ఇద్దరూ సైలెంట్.. ఒక్క ముద్దుతో, ఒక్క కప్‌తో అందరికీ అందరి మనసులో ఉన్న అనుమానాలన్ని పటాపంచలయ్యాయి.
Also Read: విశ్వవిజేతలకు గురువుగా ప్రపంచకప్‌ను ముద్దాడిన మిస్టర్ వాల్