తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. ఆయన అక్టోబర్ 31న అమెరికాలోని ఆయన కూతురి వద్ద అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన చనిపోయారని తెలిసి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు. ఈశ్వర్ రావు స్వర్గం-నరకం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు. బొమ్మరిల్లు, కన్నవారి ఇల్లు, తల్లి దీవెన , చిన్న కోడలు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
ఆయన సుమారు 200 పైగా చిత్రాల్లో నటించారు. కొంతకాలం క్రితం వరకు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. తన కెరీర్ లో అగ్ర హీరోలందరితో ఈశ్వర్ రావు యాక్ట్ చేశారు. ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, దేవతలారా దీవించండి, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు.
Also read: సైబర్ నేరగాళ్ల వలలో ప్రొబెషనరీ ఐపీఎస్!