ఏపీ విభజన బిల్లు పై విచారించే క్రమంలో సుప్రీం కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం గురించి పిటిషనర్ ను ఇది ఎవరికి సంబంధించిన విషయం అంటూ ప్రశ్నలు సంధించింది. చట్టబద్దంగా ఏపీ విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందలేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీని గురించి మంగళవారం నాడు విచారణ జరగగా..కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ తరుఫున వాదించారు. రాష్ట్ర విభజన అనేది ఎంతో అశాస్త్రీయంగా జరిగిందని ఈ సందర్భంగా ఉండవల్లి ఆరోపించారు. ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసివేసి, లోక్ సభను నిలిపివేసి మరి విభజన చేసి ప్రకటించారని ఆయన ఆరోపించారు.
ఆ సమయంలో నేను ఎంపీగా ఉన్నానని ఆయన తెలిపారు. విభజన బిల్లును ఆమోదించేటప్పుడు తనను సభ నుంచి బయటికి పంపించివేశారని ఆయన పేర్కొన్నారు. ఎందరితోనో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేవలం 30 నిమిషాల్లో తేల్చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
ఉండవల్లి వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం..ఇది రాజకీయ సమస్య అయితే మేమేందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇది పార్లమెంట్ కు సంబంధించిన కేసు.ఇందులో ఏముంది? అంటూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి కేసులు చాలానే పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది.
విభజన తీరును వ్యతిరేకిస్తూ ఉండవల్లి, మరో 20 మంది అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.