AP News: ఘన, ద్రవ వ్యర్థాల ప్రాజెక్టును దశల వారీగా జిల్లా వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఆర్.సంపత్‌కుమార్ తెలిపారు. జూపూడి పంచాయతీ ప్రాంగణంలో కేంద్ర ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టును రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యాలయం, సమీపంలోని పాఠశాలల్లో గ్రామంలోని మురుగు నీటితో సాగు చేసిన ఆకుకూర, తీగజాతి కూరగాయలు, పశుగ్రాస తోటలను పరిశీలించి జూపూడి మోడల్ ను రాష్ట్ర మోడల్‌గా ప్రకటించారు.
This browser does not support the video element.
ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టులో వ్యయాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను సమీక్షించనున్నట్లు వివరించారు. గ్రామాల్లోని గృహాల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగించడం పంచాయతీలకు ఆర్థిక భారంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేస్తే మురుగు నీటి శుద్ధి అవసరం కూడా ఉందన్న జేసీ సంపత్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామంలోని సిమెంట్ రహదారుల పక్కన మురుగు కాలువల్లో తోటల సాగుకు అవసరమైన మట్టితో పాటు సహజ ప్రక్రియలో మురుగునీటి శుద్ధికి వినియోగించే కంకర, ఇసుక తదితర వాటిని వేసి కాలువలో, కాల్వ గట్టు వెంట తీగజాతి, ఆకుకూర తోటలు సాగు చేయవచ్చన్నారు.
This browser does not support the video element.
తక్కువ ధరకు పోషకాలతో కూడిన పశుగ్రాసం
దీంతోపాటు పశుగ్రాసం పెంపకం కూడా చేపడితే పోషకులకు తక్కువ ధరకు పోషకాలతో కూడిన పశుగ్రాసం అందించవచ్చని జేసీ వివరించారు. దీనివల్ల పంచాయతీకి అదనపు ఆదాయం వస్తుందన్నారు. మురుగు నీరు ఎక్కడ నిల్వ ఉండకపోవడంతో దోమలు తదితర వ్యాధి క్రిములు కూడా వ్యాప్తి చెందవన్నారు. ప్రాజెక్టు నిర్వహకులు శ్రీనివాసరావు ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించి సాగు పద్ధతులు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవమాత, ఎంపీపీ జ్యోత్స్న, మండల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోతే ఉద్యమిస్తాం..సీపీఎం నేతల హెచ్చరిక