Srirama Navami 2024: అందరి బంధువు.. ధర్మానికి నిలువెత్తు నిర్వచనం.. మనిషి ఎలా ఉండాలో.. మానవునిగా ఎటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలో.. బాధ్యత అంటే ఏమిటో.. తెలియచెప్పిన మహిమాన్వితుడు శ్రీరాముడు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో విశిష్టమైన.. లౌకిక బంధాలకు దగ్గరగా నడయాడిన అవతారపురుషుడు రామచంద్ర మూర్తి. రామ అనే రెండక్షరాలు పలికితే చాలు మనసు పులకరించిపోతుంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం 51114.. జనవరి 10వ తేదీన జన్మించి ఉంటారని శాస్త్రవేత్తలు లెక్కలు కట్టిన శ్రీరామచంద్రుడు మన తిథుల ప్రకారం.. త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం మన తిథుల ప్రకారం ఛైత్ర శుద్ధ నవమిని శ్రీరామనవమిగా వైభవంగా పండుగ చేసుకుంటాం. అయితే, శ్రీరామనవమి(Srirama Navami 2024) రోజునే సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. ఎందుకలా? తెలుసుకుందాం.
రెండు తిథులూ ఒకటే..
శ్రీరాముడు అవతార పురుషుడు. ఒక ప్రత్యేకమైన కారణం కోసం జన్మించిన వాడు. రావణుని సంహారం.. మానవ ధర్మాన్ని లోకానికి చాటి చెప్పడమే ఆ అవతార పరమార్ధం. అందుకే తండ్రి మాట జవదాటని కొడుకుగా.. గురువులను మెప్పించిన శిష్యుడిగా.. ఇక పత్నీవ్రతుడుగా.. ఇలా అన్ని ధర్మాలను ఎలా పాటించాలో చేసి చూపించాడు. కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని వదలకుండా ఉంటే , ప్రపంచమే మనకు మోకరిల్లుతుంది అని చాటి చెప్పాడు రాముడు. రాముడు సీతాదేవిని స్వయంవరంలో శివధనుస్సు వంచడం ద్వారా వరించాడు. వారి కళ్యాణ ముహూర్తం ఛైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలోవచ్చింది. శ్రీరాముడు పుట్టిన తిథి కూడా అదే. అందుకే, శ్రీరామనవమి(Srirama Navami 2024)రోజున రాముడి జన్మదినంగానూ.. అటు కళ్యాణోత్సవంగానూ జరుపుకుంటారు.
Also Read: మహాభారత కాలం నాటి ఈ ప్రదేశాలు నేటికీ మన చుట్టూ ఉన్నాయి.. అవేంటో చూద్దామా?
భద్రాచలం ప్రత్యేకత..
శ్రీరాముడు పుట్టిన ఊరిగా అయోధ్యకు ఎంత ప్రత్యేకత ఉందో.. అరణ్యవాస సమయంలో అడుగుపెట్టి.. అక్కడ తనకు సహకరించిన భద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సీతాలక్ష్మణ సమేతంగా కొలువయిన భద్రాచలం క్షేత్రానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణాన్ని(Srirama Navami 2024) ఇక్కడ నిర్వహిస్తారు. రాములోరి పెళ్లికి చేతితో వలిచి వడ్లను ముత్యాలతో కలబోసి తలంబ్రాలుగా వినియోగిస్తారు. ఈ తలంబ్రాలకు ఎనలేని ఖ్యాతి ఉంది. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి దేవతలంతా అతిధులుగా వస్తారని ప్రతీతి. అందుకే, శ్రీరామనవమి రోజున భద్రాచలంలో భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందిస్తారు. ఊరంతా.. పెళ్లికళ వచ్చేస్తుంది. ప్రతి ఇల్లూ సీతమ్మవారి పుట్టిల్లుగా మారిపోతుంది. ప్రతి గడపా రాములోరి స్వాగతం పలుకుతుంది. అంగరంగ వైభవంగా లక్షలాది భక్తుల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుంటే ఆ వేడుక చూడటానికి రెండు కాళ్ళూ చాలవు.
రమ్యమైన రామ నామం..
Srirama Navami 2024: రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారం... రామ రహస్యఉ పనిషత్ ప్రకారం, రామ అనే పేరుకు అనేక అర్థాలు ఉన్నాయి. రాముడు యోగినో యత్ర రామ అని అర్థం. మరో మాటలో చెప్పాలంటే, యోగీశ్వరులు ఆనందించే భగవంతుడు రాముడు. రామ అంటే ‘రాక్షస యేన మరణం యాంతి - రామ’ అనే అర్ధం వస్తుంది. రాక్షసులను సంహరించిన వాడు అని దీని అర్ధం.
Srirama Navami 2024: శ్రీరామ నవమి రోజున రామనామస్మరణ చేయడం పుణ్యం అని చెబుతారు. రాముడు అంటే తారకమంత్రం. తారకమంత్రానికి మరో అర్ధం సులభంగా కష్టాలను దాటించేది అని. ఇంకా రామ అనే తారకమంత్రానికి ఉన్న పెద్ద విశిష్టత ఏమిటంటే.. మనం ఏ మంత్రం చెప్పాలన్నా.. చివర నమః అని చెప్పాలి. ఉదాహరణకు శ్రీ మాత్రే నమః.. శివాయనమః.. ఇలా కానీ, రామ మంత్రానికి మాత్రం శ్రీరామ అంటే చాలు. అంత మహోన్నతమైనది రామ నామం. అందుకే ఈ శ్రీరామనవమి రోజున రామనామ తారక మంత్రాన్ని జపించుకుందాం. అన్నట్టు.. “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే’ అని మూడుసార్లు చెబితే.. అది విష్ణు సహస్రనామాలను చెప్పినట్టే అని చెబుతారు. ఈ మంత్రం విష్ణుసహస్ర నామాల్లో చివరిగా వస్తుంది.