మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ క్యారిడార్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్రీనిధి కళాశాల యాజమాన్యం దారుణానికి పాల్పడింది. విద్యార్ధుల తల్లిదండ్రులతో పాటు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగగా.. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వారిపై దాడికి పాల్పడింది. బి టెన్షన్‌కు గురైన విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి వెళ్లారు. అయితే కాలేజీ యాజమాన్యం ఆ విషయం గురించి తాము మాట్లాడమని తేల్చి చెప్పడంతో ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు.
దీంతో రంగంలోకి దిగిన కళాశాల సిబ్బంది వారితో మాట్లాడకుండా వాగ్వాధానికి దిగారు. విద్యార్థి నేతలు చెప్పేది వినని సిబ్బంది.. శ్రీనిధి యాజమాన్యం ఆదేశాలతో ఏబీవీపీ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. మాకు పెద్దల అండ ఉంది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. మరోవైపు కళాశాల సెక్యూరిటీ సిబ్బంది దాడిలో గాయపడ్డ వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాట్లాడుదామని వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులపై సైతం ఘాటుగానే స్పందించారు. . బి టెన్షన్‌కు గురైన విద్యార్థుల గురించి మాట్లాడటానికి వెళ్లిన వారు విద్యార్థి సంఘం నేతలను ఎందుకు తీసుకెళ్లారన్నారు. ఇలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించారా అని ప్రశ్నించారు. మీ పిల్లలు చదువు గురించి మాట్లాడటానికి పెరెంట్స్ మాత్రమే వెళ్తే ఎలాంటి గొడవ జరిగి ఉండేది కాదని, ఏబీవీపీ కార్యకర్తలను తీసుకెళ్లారు కాబట్టే ఈ రాద్దాంతం జరిగిందని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసులు ఇరువురికి సూచించారు.