Rama Navami : సకల గుణాభిరాముడు.. అందాల తల్లి సీతమ్మ పెళ్లి వేడుక కోసం తెలంగాణ(Telangana) లోని భద్రాచలం(Bhadrachalam) సర్వాంగ సుందరంగా తయారు అయ్యింది. మిథిలా ప్రాంగణాన్ని ఆలయాధికారులు అందంగా ముస్తాబు చేశారు. రాముల వారి కల్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12. 30 గంటల వరకు కూడా జరగనున్నాయి.
మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాముల వారి కల్యాణం జరగనుండగా ముందుగా తిరు కల్యాణానికి సంకల్పం పలకనున్నారు. అభిజిత్ లగ్నం సమీపించగానే వేద పండితులు జీలకర్ర బెల్లాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తమని జగత్ కల్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు.
కమనీయంగా సాగే కల్యాణ వేడుకకు ప్రతి సంవత్సరం కూడా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు(Talambras) ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Santhi Kumari) రాములవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వైభవోపేతంగా సాగే ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు వివరించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, ఫ్యాన్లు, కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుమారు 2 వేల మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.
Also read: శ్రీరామ నవమి నాడు ఈ పనులు చేశారంటే… కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!