/rtv/media/media_files/2025/11/05/virat-kohli-2025-11-05-08-25-24.jpg)
Virat Kohli
భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు మరిచిపోలేనిది. తన బ్యాటింగ్, రికార్డులతో విరాట్ కోహ్లీ చిన్న వయస్సులోనే ఇండియన్ క్రికెట్‌లో తన పేరును లిఖించకున్నారు. క్రికెట్‌పై మక్కువతో, దూకుడు ఆటతీరుతో కోహ్లీ టాప్ ఇండియన్ క్రికెటర్స్‌లో ఒకరిగా ఎదిగారు. అయితే బ్యాటింగ్ దిగ్గజం కోహ్లీ సచిన్ వరల్డ్ రికార్డును కూడా బద్దలు కొట్టారు. నేడు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా ఆ రికార్డులు ఏంటో మరి చూద్దాం.
90 పరుగులు చేసి..
విరాట్ కోహ్లీ 1988న నవంబర్ 5న ఢిల్లీలో జన్మించారు. కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ ఒక క్రిమినల్ లాయర్ కాగా, తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి. ఆయన చిన్నప్పుడే వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. 2006లో తన తండ్రి మరణించిన మరుసటి రోజు ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 90 పరుగులు చేసి.. ఆటపై తనకు ఉన్న నిబద్ధతను చూపించాడు. 2008లో కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అదే సంవత్సరంలో శ్రీలంకపై వన్డేల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. 2011లో టెస్ట్, 2010లో టీ20ల్లో అరంగేట్రం చేశారు. కోహ్లీ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నారు. ఆయన ఆటతీరు, అత్యున్నత ఫిట్‌నెస్ స్థాయి, కవర్ డ్రైవ్ షాట్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.
రికార్డుల రారాజు
కోహ్లీ తన కెరీర్‌లో సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో ఆయన ప్రదర్శించిన ఆధిపత్యం తిరుగులేనిది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టి వన్డే ఫార్మాట్‌లో 51 శతకాలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నారు. అంతేకాక వన్డేల్లో 8,000 నుంచి 13,000 వరకు ప్రతి 1000 పరుగుల మైలురాయిని, అలాగే 27,000 అంతర్జాతీయ పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. ఒకే ప్రపంచకప్‌లో అత్యధికంగా 765 పరుగులు చేసిన అరుదైన రికార్డును ఆయన నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం మూడు ఫార్మాట్‌లలో కలిపి ఆయన 82కు పైగా సెంచరీలు సాధించారు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు (4000+), ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు (8,600+) చేసిన బ్యాట్స్‌మెన్ రికార్డులు కూడా కోహ్లీకే దక్కాయి.
అవార్డులు
కెప్టెన్‌గా కోహ్లీ భారత క్రికెట్‌కు గొప్ప విజయాలు అందించారు. 40 టెస్టు విజయాలతో, భారత్‌కు అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని భారత్ నమోదు చేశారు. వ్యక్తిగత ప్రతిభకు గుర్తింపుగా, అంతర్జాతీయ టీ20లలో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు (7) గెలుచుకున్నారు. కోహ్లీకి లభించిన ముఖ్యమైన అవార్డులలో ICC వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (నాలుగు సార్లు), ప్రతిష్టాత్మకమైన సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ (ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్) రెండుసార్లు (2017, 2018), ICC దశాబ్దపు ఆటగాడు (2020) ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆయనను అర్జున అవార్డు (2013), పద్మశ్రీ (2017), దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన ఖేల్ రత్న (2018) వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది.
Follow Us