/rtv/media/media_files/2025/10/17/chamu-2025-10-17-18-14-40.jpg)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యున్నత కమిటీ అయిన అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా తెలుగు వ్యక్తి, మాజీ రంజీ క్రికెటర్ వాకిన చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. భారత క్రికెటర్ల అసోసియేషన్ (ICA) ప్రతినిధిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ICA) ఎన్నికల్లో చాముండేశ్వరనాథ్ అపార మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థి రాజేష్ జడేజాపై ఆయన ఘన విజయం సాధించారు. బుధ, గురువారాల్లో జరిగిన ఐసీఏ ఈ-ఓటింగ్‌లో చాముండికి రికార్డు స్థాయిలో మద్దతు లభించింది. చాముండికి 755 ఓట్లు రాగా.. రాజేశ్ జడేజాకు 83 మాత్రమే వచ్చాయి. మొత్తం 838 మంది క్రికెటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
మొదటి తెలుగు వ్యక్తిగా
రాజమండ్రికి చెందిన చాముండేశ్వరనాథ్ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో ICA ప్రతినిధిగా ఎన్నికైన మొదటి తెలుగు వ్యక్తిగా నిలిచారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో చాముండేశ్వరనాథ్ మూడేళ్లపాటు కొనసాగుతారు. ఇక ఐసీఏ తరపున మహిళా క్రికెటర్ల ప్రతినిధిగా సుధా షాకు అపెక్స్ కౌన్సిల్‌లో చోటు దక్కగా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఐసీఏ ప్రతినిధిగా శుభాంగి దత్తాత్రేయ కులకర్ణి ఎన్నికయ్యారు.
వంకిన చాముండేశ్వరనాథ్ 1959 జూన్ 25న పుట్టారు. 1978 నుంచి 1992 మధ్య కాలంలో ఆంధ్ర జట్టుకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఆటతో పాటు ఆయన వ్యాపారవేత్తగా, క్రీడా నిర్వాహకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 19 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టారు. మొత్తం14 సీజన్లలో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించారు. 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన చాము సగటు 26.34. మొత్తం 1,818 పరుగులు చేశాడు. 1988-89, 1990- 91 మధ్య 13 మ్యాచ్‌లకు ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు.
కార్లను బహుమతిగా ఇస్తూ
చాముండేశ్వరనాథ్‌ను సన్నిహితులు ఆయనను చాముండి అని పిలుస్తారు. దేశానికి పతకాలు సాధించిన అనేక మంది క్రీడాకారులకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కార్లను బహుమతిగా ఇస్తూ ప్రొత్సహిస్తూ ఉంటారు. ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్లకు BMW కార్లను బహుమతిగా ఇచ్చారు. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్‌కు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కూడా ఆయన గతంలో కార్లను అందించారు. క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికే ఈ బహుమతులు ఇస్తానని ఆయన పలు సందర్భంలో వెల్లడించారు. చాముండేశ్వరనాథ్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చాలా సన్నిహితుడు. ఈ స్నేహం కారణంగానే క్రీడాకారులకు బహుమతులు ఇచ్చే కార్యక్రమాల్లో సచిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేవారు.