/rtv/media/media_files/2026/02/19/umpire-dies-2026-02-19-15-48-31.jpg)
క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన విషాదం నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో 65 ఏళ్ల సీనియర్ అంపైర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో సుమారు 20 మంది ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. శుక్లాగంజ్ ఏరియాలోని సప్రూ మైదానంలో ఫిబ్రవరి 18 సాయంత్రం క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కాన్పూర్‌కు చెందిన మానిక్ గుప్తా (65) ఈ మ్యాచ్‌కు అంపైరింగ్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్ నడుస్తున్న సమయంలో అకస్మాత్తుగా తేనెటీగల గుంపు మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అఫిషియల్స్‌పై విరుచుకుపడింది. దీంతో మైదానంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆటగాళ్లు, ప్రేక్షకులు దిక్కుతోచక పరుగులు తీశారు.
అంపైర్‌పై తీవ్రస్థాయిలో దాడి
ప్రత్యక్ష సాక్షుల చెప్పిన ప్రకారం.. తేనెటీగలు అంపైర్ మానిక్ గుప్తాని తీవ్రంగా కుట్టాయి. దాడి తీవ్రతకు ఆయన మైదానంలోనే స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను శుక్లాగంజ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కాన్పూర్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఎస్.ఎన్. సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "గుప్తాను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కూడా ఆయన ముఖం, శరీరంపై తేనెటీగలు అంటుకునే ఉన్నాయంటే దాడి ఎంత భీకరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో మరో అంపైర్‌తో పాటు 20 మంది క్రికెటర్లు గాయపడ్డారని, వారిలో కొందరికి చికిత్స అందుతోందని తెలిపారు. ఒక చిన్న అజాగ్రత్త లేదా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఒక సీనియర్ అంపైర్ మృతి చెందడం స్థానిక క్రికెట్ వర్గాల్లో విషాదాన్ని నింపింది.
Follow Us