Prithvi Shaw: పృథ్వీ షా రచ్చరచ్చ! బౌలర్ పై బ్యాట్‌తో దాడి - షాకింగ్ వీడియో

క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. రంజీ వార్మప్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున 181 పరుగులు అద్భుత శతకం సాధించి ఔటైన తర్వాత ముంబై బౌలర్ ముషీర్‌ ఖాన్‌పై దాడికి దిగాడు. ముషీర్ స్లెడ్జింగ్‌ చేయడంతో ఆగ్రహించిన షా అతడిపై బ్యాటుతో దాడికి యత్నించాడు.

New Update
Prithvi Shaw Musheer Khan fight

Prithvi Shaw Musheer Khan fight

భారత క్రికెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి వార్తల్లో నిలిచాడు. గ్రౌండ్‌లో తన క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రదర్శించి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు ముంబై vs మహారాష్ట్ర మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ అక్టోబర్ 7న పూణేలో జరిగింది. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు తరఫున ఆడిన వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన షా.. ఆ వెంటనే ముంబై యువ ఆల్ రౌండర్ ముషీర్ ఖాన్‌ (Musheer Khan)తో (సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు) ఘర్షణకు దిగాడు.

Prithvi Shaw Musheer Khan fight

పేలవ ఫామ్, ఫిట్‌నెస్‌, పర్సనల్ ఇష్యూస్‌తో జాతీయ జట్టుకు దూరమైన పృథ్వీ షా ఇటీవల ముంబై జట్టును వీడి మహారాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో తన మాజీ జట్టు ముంబైపై పృథ్వీ షా సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. 140 బంతుల్లో 181 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణితో కలిసి 305 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 

భారీ స్కోరు దిశగా సాగుతున్న పృథ్వీ షా.. చివరికి ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్ వద్ద క్యాచ్ ఇచ్చి 181 పరుగుల వద్ద ఔటయ్యాడు. షా ఔటైన వెంటనే ముషీర్ ఖాన్ ‘థ్యాంక్యూ’ అని అంటూ సెండాఫ్‌ ఇచ్చాడు. దీంతో ముషీర్ స్లెడ్జింగ్‌కు ఆగ్రహానికి గురైన పృథ్వీ షా వెంటనే ముషీర్ వద్దకు పరిగెత్తి వాగ్వాదానికి దిగాడు. కోపంతో ముషీర్ ఖాన్ కాలర్ పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పాటు, తన చేతిలో ఉన్న బ్యాట్‌ను అతని వైపు విసురుతూ దాడికి యత్నించాడు. దీంతో గ్రౌండ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పృథ్వీ షా ఆవేశాన్ని గమనించిన అంపైర్లు, తోటి ఆటగాళ్లు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

అంపైర్లు జోక్యం చేసుకుని పృథ్వీ షాను బలవంతంగా మైదానం నుంచి బయటకు పంపించారు. డగౌట్‌కు వెళ్తుండగా కూడా ముంబై మాజీ సహచర ఆటగాడు సిద్ధేశ్ లాడ్‌తో కూడా పృథ్వీ షా వాగ్వాదానికి దిగినట్టు వీడియోలో కనిపించింది. టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ, పదేపదే ఇలాంటి వివాదాలతో పృథ్వీ షా తన క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రదర్శించడంపై క్రికెట్ అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘‘నువ్వు మారవా బ్రో?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరాలంటే టాలెంట్‌తో పాటు క్రమశిక్షణ కూడా అవసరమని వారు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు