KL Rahul: భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మరోసారి బెంగళూర్ జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్న రాహుల్.. వచ్చే సీజన్ లోనే ఆర్సీబీకి ఆడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇటీవలో ఓ అభిమానితో సంభాషణలో రాహుల్ సైతం ఆర్సీబీకి ఆడటాన్ని ఆశ్వాదిస్తానని చెప్పడం దీనికి మరింత బలం చేకూరింది.
ఈ మేరకు ఇటీవల ఆర్సీబీతో చేరాలని ఓ అభిమాని రాహుల్ ను కోరుతూ.. 'బెంగళూర్ జట్టుకు నేను బిగ్ ఫ్యాన్. గతంలో మీరు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నిజంగా బెంగళూరు జట్టులోకి రావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. అయితే అభిమాని రిక్వెస్ట్ పై పాజిటీవ్ గా స్పందించిన రాహుల్.. ‘అదే జరగాలని ఆశిద్దాం’ అన్నాడు. దీంతో మరోసారి రాహుల్ ఆర్సీబీలోకి రాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతోపాటు గత సీజన్ లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో లఖ్‌నవూ చిత్తుగా ఓడటంతో మైదానంలోనే రాహుల్‌పై ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆ జట్టును వదిలేస్తాడనే ఊహగానాలందుకున్నాయి. ఇక 2013లో ఆర్సీబీతోనే రాహుల్ ఐపీఎల్ కెరీర్ మొదలవగా.. 2014, 2015లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2016లో తిరిగి బెంగళూరు ఆడాడు. 2022 నుంచి లఖ్‌నవూ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.