Telugu Language Day: తెలుగు జాతి తియ్యదనం...తెలుగు భాష గొప్పదనం..!

తెలుగు భాషను కాపాడేందుకు, గౌరవించేందుకు ఎంతో మంది కృషి చేశారు. వారిలో తెలుగుభాష ఉద్యమానికి ఆద్యులు అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఏటా ఆగస్ట్ 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దాని గురించి ప్రత్యేక కథనం..

Telugu Language Day: తెలుగు జాతి తియ్యదనం...తెలుగు భాష గొప్పదనం..!
New Update

Telugu Language Day: దేశ భాషలందు తెలుగు లెస్స..అని రాయలవారే కీర్తించిన గొప్ప చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష. తెలుగు భాష గురించి ఎంతో మంది కవులు, సినీ గేయ రచయితలు పాటలు, పద్యాలు కూడా రాసి అవార్డులు కూడా అందుకున్న సందర్భాలున్నాయి. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా కీర్తి గడించింది మన తెలుగు భాష.

అమ్మ లాంటి మాతృభాష వెలుగు మసకబారుతుందనుకుంటున్న సమయంలో .. తెలుగుకి వెలుగు చూపించేందుకు అనేక మంది కృషి చేశారు. వారిలో ప్రముఖులు గిడుగు వెంకట రామ్మూర్తి. వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు గిడుగు రామ్మూర్తి ఎంతో కృషి చేశారు. ఆయన తెలుగు భాష అభివృద్దికి చేసిన కృషికి గానీ, అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు జయంతిని మాతృ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

1863 ఆగస్టు 29న మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లా, నేటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో గిడుగు రామ్మూర్తి జన్మించారు. ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తగానూ గిడుగు రామమూర్తి పంతులుకి మంచి పేరుంది. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించినన గిడుగు.. విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.

తెలుగు భాషకు చాలా ప్రాచీన నేపథ్యం ఉంది. సంగీతం,సాహిత్యం, కవిత్వం, కథ ఇలా అన్ని కళల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యం ఉంది. దేశంలోని 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం ద్వారా 1966 లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. 2008 లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి గౌరవించారు.

దేశంలో హిందీ, బెంగాలీ భాషల తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. విదేశాల్లోనూ అధిక సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. అయితే అంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష మనుగడకు, ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నేటి రోజుల్లో ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

Also Read: ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..ఈ సారి పెన్షన్‌ సెప్టెంబర్‌ 1 కాదు…ఎప్పుడంటే!

#language #telugu #matrubhasha-dinotsavam #telugu-language-day
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe