Revanth Reddy: సోనియా పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు ఓ పండుగ!

సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ భవన్‌ లో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర నేతలు కలిసి కేక్‌ కట్‌ చేసి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం సోనియా గాంధీనే అని కొనియాడారు.

New Update
Revanth Reddy: సోనియా పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు ఓ పండుగ!

Sonia Gandhi Birthday: తెలంగాణ గాంధీ భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం అయిన తరువాత మొదటిసారి గాంధీ భవన్ (Gandhi Bhavan) కి వచ్చిన రేవంత్ రెడ్డి (Revanth Reddy), మల్లు భట్టి విక్రమార్క..ఈ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం నాడు సోనియా తన 79 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

ఈ సందర్బంగా గాంధీ భవన్ లో 78 కేజీల కేక్‌ ను రేవంత్‌ రెడ్డితో కలిసి కాంగ్రెస్ (Congress) నేతలు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రే తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్‌ నేత వీహెచ్‌ తో రేవంత్‌ సోనియా గాంధీ పుట్టిన రోజు కేక్‌ ను కట్ చేయించారు.

కేక్ కట్‌ చేసిన తరువాత సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. సోనియా పుట్టిన రోజు నాడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటూ కొనియాడారు.

ఎందరో కార్యకర్తల త్యాగం, కష్టంతోనే తెలంగాణ సాధించుకున్నామని..ఈరోజు అధికారంలో నిలబడ్డామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనకు తెలియదు..డిసెంబర్‌ 7న ఎల్బీ స్టేడియానికి వచ్చిన సోనియా గాంధీ (Sonia Gandhi) రూపంలో తెలంగాణ తల్లిని చూశామంటూ ఆయన వివరించారు.

ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మొదటి సారి గాంధీ భవన్ లో కాలు పెట్టాను. ఇప్పుడు డిసెంబర్‌ 9 ముఖ్యమంత్రి హోదాలో గాంధీ భవన్ కు వచ్చాను అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి కూడా అనేక వేల కేసులు నెత్తిన పెట్టుకుని మోస్తున్నారని తెలిపారు.

మొదటి సారి శనివారం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం..ప్రజలందరూ కూడా ఆశీర్వాదించాలని రేవంత్‌ కోరారు. సోనియామ్మ పుట్టిన రోజు నాడే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని రేవంత్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తామని దానికి ప్రజలందరి సహకారం కావాలని ఆయన కోరారు.

Also read: రేవంత్ రెడ్డి జాతకంలో రాజయోగం! పదవీకాలం ఎలా ఉంటుంది?

Advertisment
తాజా కథనాలు