Solar Eclipse 2024: ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈరోజు ఏర్పడనుంది. ఇవాళ రాబోయే సూర్యగ్రహణం అనేది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతీయ కాలమాన ప్రకారం.. ఏప్రిల్ 8, 2024న రాత్రి 9:12 PM గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 9, 2024 తెల్లవారుజామున 2:22 AM వరకు గ్రహణం కొనసాగుతుంది. ఉత్తర అమెరికాలోని (America) పలు ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని ఎదుర్కొంటాయని.. భారత్‌లో ఈ గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read: యూట్యూబ్ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన టీచర్
ఉత్తర అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం చూసే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని చూసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. కళ్లకు రక్షణ లేకుండా సూర్యుడిని ప్రత్యక్షంగా చూస్తే తీవ్రమైన కంటి సమస్యలు వస్తాయి. సూర్యగ్రహణం చూసేటప్పుడు సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్, బైనాక్యులర్ లేదా టెలిస్కోప్‌లతో చూడటం మంచింది. ఈ సమయంలో కంటి భద్రతతో పాటు.. చర్మాన్ని కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యం.
కెనడా, మెక్సికో, యూరప్, యూకే, ఐర్లాండ్, అమెరికా తదితదర దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. 1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడిందని పేర్కొన్నారు. చంద్రుడు.. భూమి సూర్యుని మధ్య వెళ్తుతున్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యున్ని పూర్తిగా కప్పివేయడంతో అంతా చీకటిగా మారుతుంది. అయితే ఈ గ్రహణం సమయంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.