Mallu Bhatti Vikramarka: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) పై తీవ్ర విమర్శలు చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈరోజు మోటమర్రి అంకమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని అనడానికి కేసీఆర్, కేటీఆర్ (KTR) కు బుద్ధుండాలని అన్నారు. కాంగ్రెస్ (Congress) హామీల అమలు చేయడానికి నిధులు లేకుంటే.. మరి బీఆర్ఎస్ (BRS) ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఎవరిని మోసం చేస్తారు? ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారని విమర్శించారు.
ALSO READ: జానారెడ్డితో పాటు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్స్ రిజెక్ట్!
ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ప్రజలను మోసం చేయడం బీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది.. చేస్తుందే చెప్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు జరగాలంటే పాలకుల దోపిడి అరికడితే చాలని వెల్లడించారు. పరిపాలన అనుభవం కలిగిన తమకు ఆరు గ్యారంటీ అమలకు నిధులు ఎక్కడి నుండి తేవాలో తెలుసు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని 10 ఏళ్లుగా ఇందిరమ్మ ఇండ్లు కూడా రాకుండా కేసీఆర్ చేశారని మండిపడ్డారు. దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజల సంపద ప్రజలకు పంచబడాలని భట్టి వెల్లడించారు. బోనకల్ మండలంలో మూలకు విసిరేసి పడి ఉన్నట్టుగా మోటమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్డు వేశామని అన్నారు. మోటమర్రి గ్రామము నుంచి మధిర వరకు ఉన్న రోడ్డును విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలని.. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావడానికి చేయ్యి గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారంటీలు కావాలనుకునే ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?