Telangana : తెలంగాణ రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(PM Kisan Samman Nidhi) జమ కావడం లేదు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన అర్హులైన లబ్ధిదారులు, విరాసత్ ద్వారా భూమి పొందిన వారు, భూములు పంపకాలు చేసుకుని కుటుంబాలు వేరైన వారితో కలిపి దాదాపు 10 లక్షల మంది అర్హులకు ఈ సాయం అందడం లేదని తెలుస్తోంది. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు ఏటా ఒక సారి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం(Central Government) అవేమి పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారు.
భారీగా తగ్గిన లబ్దిదారుల సంఖ్య..
కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రారంభించినప్పుడు లబ్ధిదారుల సంఖ్య 20,09,462 ఉండేది. వారందరి ఖాతాల్లో ఏడాదికి రూ.405 కోట్లు జమ చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 34,73,883 చేరగా రూ.2,121 కోట్లు అందజేసింది. ఆ తర్వాత 2020–21లో 36,36,780 మంది రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేల చొప్పున రూ.2,214 కోట్లు జమ చేసింది. 2020–23లో రైతల సంఖ్య 35.81 లక్షలకు తగ్గిపోగా ఈ ఏడాది అమాంతం 30,39,181కి చేరడం విశేషం.
ఇది కూడా చదవండి: Fake adds: తప్పుడు ప్రకటనలను సహించేదిలేదు.. సెలబ్రిటీలకు సుప్రీం కోర్టు వార్నింగ్!
రైతుల ఆందోళన..
అంటే ఈ ఒక్క ఏడాదిలోనే 5 లక్షలకుపైగా లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించడం గమనార్హం. అలాగే గతంలో ఏటా రూ.2,200 కోట్ల మేర రైతులకు అందజేసిన కేంద్రం.. ఈ ఏడాది రాష్ట్ర రైతులకు రూ.1277 కోట్లు మాత్రమే జమ చేసింది. రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ ప్రారంభమైన రోజుల్లో 2018 వానాకాలం సీజన్ లో 50.2 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 70 లక్షలకు చేరింది. ప్రతి ఏటా కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారి పేర్లను రైతు బంధు జాబితాలో అప్ డేట్ చేస్తున్నారు. రాష్ట్రంలో రైతుబంధు(Rythu Bandhu) లబ్ధిదారుల సంఖ్య ఇలా పెరుగుతూ పోతుంటే.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కుటుంబాల సంఖ్యను తగ్గడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.