Us Woman Found In Maharashtra Forest: అడవిలో దొరికిన అమెరికా మహిళ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను చెట్టుకు బంధించిన విషయంలో ఇతరుల ప్రమేయం లేదని ఆమే స్వయంగా తెలిపింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని తెలిపింది. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు తెలిపింది. అయితే ఆమె తల్లి ప్రస్తుతం అమెరికాలో ఉందని తెలిసిందని...కానీ ఇప్పటి వరకు తమను ఎవ్వరూ సంప్రదించలేదని పోలీసులు చెప్పారు.
మహారాష్ట్ర (Maharashtra) లోని సింధుదుర్గ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా (America) కు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ (50) ను గుర్తు తెలియని వ్యక్తులు అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఆమె వానలో తడుస్తూ.. ఆకలితో అలమటిస్తూ నీరసించిపోయి అరుస్తుండడంతో ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనుర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం (Forest Area) లో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి.
దాంతో అతను చుట్టుపక్కల వెదికినప్పటికీ ఆమె ఎక్కడ ఉందో తెలియలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అడవిలో వెదకగా..ఓ చెట్టుకు ఇనుప గొలుసుతో కాలును చెట్టుకు కట్టేసి ఉన్న మహిళను గుర్తించారు. ఆమె వద్ద అమెరికా పాస్‌పోర్టు, తమిళనాడు ఆధార్ కార్డు, మరికొన్ని కాగితాలు కనిపించాయి.